13న మెడికల్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్!

13న మెడికల్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్! - Sakshi


ప్రాథమిక చర్చలు జరిపిన ఇరు రాష్ట్రాల అధికారులు

6న మరోసారి భేటీ, 13న నోటిఫికేషన్

ఈ ఏడాదికి పాత ఫీజులతోనే సీట్లు భర్తీ

ప్రవాస భారతీయ కోటాకు ఫీజు నిర్ధారణ

ఎస్వీ, ఎన్టీఆర్ వర్శిటీ, జేఎన్‌టీయూలలో కౌన్సెలింగ్


 

హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య వివాదాల నేపథ్యంలో ఎట్టకేలకు 13న మెడికల్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల అధికారులు సూచనప్రాయ అంగీకారానికి వచ్చారు. ఎంబీబీఎస్ ఫీజులు నిర్ణయం జరగలేదని, ఫీజు రీయింబర్స్‌మెం ట్ వివాదం కారణంగా రెండు రాష్ట్రాలు నువ్వా నేనా అంటూ కౌన్సెలింగ్‌కు ముందుకు రాలేదు. అయితే భారతీయ వైద్యమండలి నిర్ణయం మేరకు సెప్టెంబర్ 30లోగా అన్ని దశల కౌన్సెలింగ్‌లు పూర్తిచేసి, తరగతులు ప్రారంభించాలని నిబంధన ఉంది. ఆ లోగా పూర్తి కాకపోతే సీట్లు రద్దవుతాయి. దీంతో ఉభయ రాష్ట్రాల అధికారులు శనివారం ప్రాథమికంగా చర్చలు జరిపారు. ఈనెల 6న మళ్లీ ఒకసారి ఇరు రాష్ట్రాల అధికారులు భేటీ కానున్నారు. ఈనెల 13న నోటిఫికేషన్ ఇవ్వాలని ఆరోజు వీలుకాకపోతే ఆగస్ట్ 14న ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కౌన్సెలింగ్ తేదీ తర్వాత నాలుగు రోజుల్లో భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. గతంలో లాగే ఎస్వీఆర్ కళాశాల తిరుపతి, విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలలో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.



పాత ఫీజులతోనే సీట్ల భర్తీ



ఈ ఏడాది పాత ఫీజులతో భర్తీ చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకారానికి వచ్చారు. ఈమేరకు ఆయా ప్రైవేటు కళాశాలలకు సైతం సమాచారమిచ్చారు. ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించినట్టు ఇప్పటికిప్పుడు ప్రత్యేక ప్రవేశ పరీక్ష, కామన్ ఫీజు విధానాలు అమల్లోకి తేలేమని, పాత ఫీజులతోనే ఈ ఏడాది భర్తీ చేద్దామని వారికి చెప్పారు. ప్రస్తుతం కన్వీనర్ కోటాకు ఏడాదికి రూ.60 వేలు, బి.కేటగిరీ కోటాకు రూ.2.40 లక్షలు, యాజమాన్యకోటా సీట్లకు రూ.5.50 లక్షలు వసూలు చేస్తున్నారు. అలాగే డెంటల్ సీట్ల విషయంలో కన్వీనర్ కోటాకు ఏడాదికి రూ.45 వేలు, బి.కేటగిరీ సీట్లకు రూ.1.30 లక్షలు, యాజమాన్య కోటా సీట్లకు రూ.2.50 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది అంటే 2014-15 విద్యా సంవత్సరానికి కూడా ఉభయ రాష్ట్రాల్లో అవే ఫీజులు ఉంటాయి.



ఎన్‌ఆర్‌ఐ కోటాకూ ఏడాదికి 25వేల డాలర్లు



ప్రవాస భారతీయ విద్యార్థుల కోటాకు ఏడాదికి 25 వేల డాలర్లు ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీలో ఏడాదికి రూ.15 లక్షలు అవుతుంది. గతంలో ఇచ్చిన జీవో ఆధారంగానే ఎన్‌ఆర్‌ఐ సీట్ల భర్తీ చేసుకోవాలని, ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజు పై ఇంకా ప్రైవేటు కళాశాలలను సంప్రదించాల్సి ఉంద ని ఓ ఉన్నతాధికారి చెప్పారు. యాజమాన్య సీట్ల భర్తీలోనూ ప్రముఖ దినపత్రికల్లో ప్రకటన ఇచ్చి, ఎంసెట్ మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేసుకునేలా చేయాలని అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ఫీజు రీయిం బర్స్‌మెంట్‌పై ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top