ఎంసెట్‌లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో ఈ సారి దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ఇందులోనూ అమ్మాయిలే ఎక్కువగా ఉండడం గమనార్హం.
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో ఈ సారి దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ఇందులోనూ అమ్మాయిలే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఎంసెట్ దరఖాస్తుల గడువు శుక్రవారం రాత్రి 12 గంటలతో ముగిసింది. రాత్రి 8:30 వరకు మొత్తంగా 3.83 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఎంసెట్ కన్వీనర్ రమణరావు తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో దరఖాస్తుదారుల సంఖ్య పెరగ్గా.. ఇంజనీరింగ్‌లో స్వల్పంగా తగ్గింది. అయితే ఆలస్య రుసుముతో ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 18వ తేదీ వరకు రూ. 500 ఆలస్య రుసుముతో, 25వ తేదీ వరకు రూ.1,000, మే 8 వరకు రూ. 5,000, మే 19 వరకు రూ. 10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు విద్యార్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు. మే 22న పరీక్ష జరుగనుంది.
ప్రస్తుతం, గతేడాది వచ్చిన దరఖాస్తులు..
ఈ సారి ఇప్పటివరకు మొత్తంగా 3,83,049 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 2,09,842 మంది అబ్బాయిలు, 1,73,207 మంది అమ్మాయిలు ఉన్నారు.
గత ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో ఆలస్య రుసుముతో చెల్లించిన వారిని కలుపుకొని 2,91,083 మంది దరఖాస్తు చేసుకోగా... ఈసారి ఇప్పటివరకు 2,72,972 మంది దరఖాస్తు చేసుకున్నారు.
గత ఏడాది అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం ఆలస్య రుసుముతో చెల్లించిన వారు కలుపుకొని 1,05,070 మంది దరఖాస్తు చేసుకోగా... ఈ సారి ఇప్పటికి 1,08,350 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండింటి కోసం 1,733 మంది దరఖాస్తు చేసుకున్నారు.
గత ఏడాది అమ్మాయిలు అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 64,578 మంది, ఇంజనీరింగ్ కోసం 1,08,822 మంది దరఖాస్తు చేసుకోగా... ఈసారి అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 68,737 మంది, ఇంజనీరింగ్ కోసం 1,03,647 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారు.
గత ఏడాది అబ్బాయిలు అగ్రికల్చర్, మెడికల్‌కు 40,492 మంది, ఇంజనీరింగ్‌కు 1,82,261 మంది దరఖాస్తు చేసుకోగా... ఈ సారి అగ్రికల్చర్, మెడికల్‌కు 39,613 మంది, ఇంజనీరింగ్‌కు 1,69,325 మంది దరఖాస్తు చేసుకున్నారు.