అవును..అక్కడ అన్నీ ఐరావతాలే

Media Centre Is Neglected By Officers In Prakasam - Sakshi

ఎందుకూ కొరగాని మీడియా కేంద్రం

సమాచార సేకరణకు ప్రయాసకోర్చాల్సిందే

ఏ సమాచారం అడిగినా .. సిబ్బంది తెల్లముఖం 

సాక్షి, ఒంగోలు సిటీ: ఎన్నికల వేళ పేరుకే మీడియా కేంద్రం. ఇక్కడ సమాచారమే మృగ్యం. ఆ కేంద్రంలో అన్నీ తెల్ల ఏనుగులే. పని చేసేదే లేదు. వాటికి మొక్కినా ఫలితం శూన్యం అన్నది తేటతెల్లం. మీడియా కేంద్రంలోని ఐరావతాల వల్ల జిల్లా పౌరులకు ఎన్నికల వేళ అందాల్సిన సమాచారం వస్తేనా. యథారాజా తథాప్రజా అన్నట్లుగా సిబ్బంది పనితీరు ఉంది. జిల్లా కేంద్రంలో ఈ మీడియా  పాయింట్‌  పేరుకు మాత్రమే. తాత్కాలికంగా మీడియా సెంటర్‌ బోర్డు. దానికి ఆనుకొని నిక్‌నెట్‌ శాఖ బోర్డు కూడా ఉంటుంది. ఇంతకీ ఈ కార్యాలయంలో ఏ విభాగం నడుస్తుందో కూడా తెలియని పరిస్థితి. అంతా అయోమయం. జిల్లా ఏర్పడిన తర్వాత మీడియా కేంద్రం నిర్వహణలో ఇంతటి లోపాలు ఎప్పుడూ ఎదురుకాలేదు. జిల్లా పరిపాలనా కేంద్రం ప్రకాశం భవన్‌లోకి  వచ్చేటప్పుడు దక్షిణం వైపు ఉన్న ప్రజాఫిర్యాదుల విభాగం గదిలో ప్రత్యేకంగా మీడియా కేంద్రం నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ఇక్కడ మీడియా పాయింట్‌ ఉంటుంది. టెలిఫోన్, కంప్యూటర్, ఫ్యాక్స్‌ సదుపాయం ప్రత్యేకంగా ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాకు ఉంటుంది. ఒంగోలు, బాపట్ల లోక్‌సభ అభ్యర్థులు నామినేషను వేసి ఇక్కడ మీడియాతో మాట్లాడేవారు. అక్కడి నుంచే ఫొటోలు, ఇతర సమాచారాన్ని చేరవేసుకొనే సదుపాయం ఉండేది. ఈ దఫా ఎన్నికల్లో అందరూ భావిస్తున్నట్లుగా ఫోర్త్‌ ఎస్టేట్‌ అయిన మీడియా అవసరం లేదనుకున్నారేమో..ఈ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశారన్న విమర్శలున్నాయి.

పై అంతస్తులో మీడియా కేంద్రం
ప్రకాశం భవన్‌ మొదట్లోనే ఉండే మీడియా కేంద్రం ఈ ఎన్నికల సందర్భంగా లేకుండా పోయింది. ఇక్కడ అభ్యర్థులకు నామినేషన్‌ ఫారాలు ఇచ్చే విభాగంగా మార్చేశారు. ఇంతకీ మీడియా కేంద్రం ఎక్కడ పెట్టారంటే .. ప్రకాశం భవన్‌ టాప్‌ఫ్లోర్‌లోని నిక్‌నెట్‌ కేంద్ర కంప్యూటర్‌ విభాగంలో ఏర్పాటు చేశారు. అక్కడికి మీడియా వెళ్లాలంటే ప్రకాశం భవన్‌ ఇన్, అవుట్‌ గేట్‌ల వద్దే అనుమతి లేదంటూ నిలిపివేస్తున్నారు.

ఎన్నికల వేళ కదలరు..మెదలరు
ఎన్నికల వేళ అధికారులు కదలడం లేదు. ఏ సమాచారం అడిగినా సంబంధిత రిటర్నింగ్‌ అధికారుల నుంచి స్పందన లేదంటున్నారు. ఎన్నికల వేళ వచ్చే ఫిర్యాదులు, ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఉత్తర్వులు, ఓటర్లను చైతన్య పరిచే ఉత్తర్వుల ఇతర సమాచారం ఏది అడిగినా స్పందన కొరవడుతోంది. అసలు విషయం ఏమిటంటే ఇక్కడ రెగ్యులర్‌ ఐఎన్‌పీఆర్‌ ఏడీ లేకపోవడమే ప్రధాన సమస్య. డీపీఆర్వోకే ఏడీ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. కందుకూరు, మార్కాపురంలోనూ డివిజనల్‌ పీఆర్వోలు లేరు. ఇద్దరు ఏపీఆర్వోలు జిల్లా కేంద్రంలో ఉన్నారు. రెగ్యులర్‌ ఏడీ లేరనే డ్వామా పీడీని కోఆర్డినేటింగ్‌ అధికారిగా నియమించారు. ఆయనతోనూ వీరు సక్రమంగా సహకరించే పరిస్థితి లేదు. ఎన్నికలకు సంబంధించిన నిత్యం లావాదేవీలు పరిశీలించేందుకు ప్రధానంగా 23 బృందాలను నియమించారు. ఈ బృందాలకు కోఆర్డినేటింగ్‌ అధికారులను నియమించారు. వీరి నుంచి సమాచారాన్ని సేకరించి మీడియాకు అందజేయాలి. అదే సక్రమంగా జరగడం లేదు.

సమాచార సేకరణ ప్రయాసే
జిల్లా వ్యాప్తంగా రిటర్నింగ్‌ అధికారుల నుంచి నామినేషన్లు ఇతర సమాచారాన్ని గడువు ముగిసిన తర్వాత వేగంగా సేకరించి ఇవ్వాలి. నామినేషన్లను వేసిన అభ్యర్థుల అఫిడవిట్లు ఇతర సమాచారాన్ని రోజు గడినా ఇంకా ఆర్వోల వద్ద నుంచి రాలేదన్న  జవాబు చెబుతున్నారు. మీడియా కేంద్రంలో తగిన వసతి ఉంటే అక్కడికి వచ్చి సేకరించుకొనే వీలుంది. పేరుకు మీడియా కేంద్రం అయినా అక్కడ పాత్రికేయులకు, మీడియా విలేకర్లకు వసతి లేదు. వారికి సదుపాయం కల్పించలేదు. అధికారులను ఏ సమాచారం అడిగిన తెల్లముఖం వేస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పుడు వారు మీడియాతో మాట్లాడాలంటే మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయలేదు. అదేమంటే అధికారులు నోరుమెదపరు. ఐదు రోజులు గా జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికా రుల కార్యాలయాలకు వంద మీటర్ల దూరం తర్వాత మాత్రమే మీడియా పాయింట్‌ను అనుమతించారు. అభ్యర్థులు అక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడాలి. నడి బజారులో ఈ కేంద్రం తాత్కాలికంగా మీడియా నిర్వహించుకోవడం గమనార్హం. మీడియా పాయింట్‌ సమగ్రంగా లేకపోవడం ఇతర సమస్యల గురించి  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే  పరిస్థితి లేకుండా పోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top