పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు అంత్యక్రియలు శనివారం ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి.
అశ్రునయనాలు... మస్తాన్ బాబు అమర్ రహే నినాదాల నడుమ.... నింగికెగసిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం నెల్లూరు జిల్లా గాంధీజనసంగంలోని అతని పొలంలోనే.... సాహసవీరుడు శాశ్వాత నిద్ర తీసుకున్నాడు. అధికారిక లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. మస్తాన్‌బాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు.
గౌరవ సూచికంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మూడుసార్లు గాల్లో కాల్పులు జరిపారు. పర్వతారోహణలో దేశ కీర్తిని ప్రపంచ నలుదిక్కులా చాటిన మస్తాన్‌బాబును....కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇక సెలవు వీరుడా అంటూ... కన్నీటితో సాగనంపారు. తుదివీడ్కోల సమయంలో మస్తాన్ తల్లి పరిస్థితి వర్ణనాతీతం. చెట్టంతా కొడుకు విగతజీవిగా మట్టిలో కలిసిపోతుంటే... చూడలేక కుమిలికుమిలి ఏడ్చింది. మస్తాన్‌బాబు అంత్యక్రియల్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొని తుదివీడ్కోలు పలికారు.