
సాహసపథం
సాహసం సైలెంట్‌గా ఉండదు. కంచుకంఠంతో మనలోని ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపుతుంది. ఆ పిలుపును కాలేజీ రోజుల్లోనే అందుకుంది శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన వాసుపల్లి కవిత.
సాహసంతో చెలిమి చేసిన కవిత బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆర్మీ వైద్యాధికారి అయిన కవిత అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యంత ఎత్తయిన గోరీచెన్ పర్వతాన్ని ఐదుసార్లు అధిరోహించింది. మరెన్నో సాహసయాత్రలకు సిద్ధం అవుతోంది.
ఉద్దానం ప్రాంతమైన వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాసుపల్లి కవితకు చిన్నప్పటి నుంచి క్రీడలు, స్విమ్మింగ్ అంటే ఇష్టం. చదువులోనూ ముందుండేది. కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. శ్రీకాకుళంలోని రిమ్స్ వైద్య కళాశాలలో సమయంలో ట్రెక్కింగ్ చేసేది.
సైన్యంలోకి....
సైన్యంలో పనిచేయాలనే ఆసక్తి కవితలో ఉండేది. 2021లో ఆర్మీ వైద్యాధికారిగా కెప్టెన్ హోదాలో ΄ోస్టింగ్ పొందిన కవిత మేజర్ స్థాయికి చేరింది. అరుణాచల్ ప్రదేశ్‌లో పనిచేస్తున్నప్పుడు సాహస క్రీడలపై ఇష్టంతో ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్’లో చేరి పర్వతారోహణకు సంబంధించి రెండు కోర్సులు, రివర్ రాఫ్టింగ్‌లో ఒక ప్రత్యేక కోర్సు చేసింది.
ప్రాణదాత
పర్వతారోహణలో శిక్షణ తీసుకున్న కవిత అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యంత ఎత్తయిన గోరీచెన్ పర్వతాన్ని ఐదుసార్లు అధిరోహించింది. కల్నల్ రణవీర్‌సింగ్ జమ్నాల ఆధ్వర్యంలో గోరీచెన్ అధిరోహించి కిందికి వస్తున్న సమయంలో బృందంలోని ఒక యువ సభ్యురాలు ఊపిరి అందక ప్రమాదంలో పడింది. కవిత ఆమెకు తక్షణ వైద్యం అందించి ప్రాణపాయం నుంచి తప్పించింది.
బ్రహ్మపుత్రలో సాహస యాత్ర
అత్యంత క్లిష్టమైన బ్రహ్మపుత్ర నదిలో 1040 కిలోమీటర్ల మేరకు విజయవంతంగా రివర్ రాఫ్టింగ్ పూర్తి చేసింది కవిత. కల్నల్ రణవీర్‌సింగ్ నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యుల బృందంలో ఆమె ఏకైక మహిళ. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. భారత–టిబెట్ సరిహద్దులోని గెల్లింగ్ గ్రామం నుంచి బ్రహ్మపుత్రలో ప్రయాణం ప్రారంభించి, ఏకధాటిగా 28 రోజులపాటు రివర్ రాఫ్టింగ్ చేశారు. ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న హాట్సింగిమారి దగ్గర తమ సాహసయాత్ర ముగించారు.
ప్రాణం మీదికి వచ్చినా సరే...
బ్రహ్మపుత్రలో రాఫ్టింగ్ సజావుగా ఏమీ సాగలేదు. ప్రాణం మీదికి తెచ్చిన ప్రమాదాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. నది ΄÷డవునా ప్రవాహ తీవ్రత, 11 అడుగుల ఎత్తులో ఎగిసిపడే అలల ఉధృతి కారణంగా ఏర్పడిన సుడిగుండంలో చిక్కుకుని బృందం ప్రమాదంలో పడింది. కాస్త ఓపిక పడితే ప్రమాదం నుంచి బయటపడొచ్చు అనుకున్నారు. ధైర్యం కోల్పోలేదు. పెద్ద అల నుంచి తప్పించుకుని, ఈదుకుంటూ రాఫ్ట్‌ను చేరుకున్నారు. ఇలా నాలుగుసార్లు రాఫ్ట్ నుంచి పడి΄ోయినా ముందుకే సాగారు. యాత్రలో రోజుకు 12 గంటలపాటు 70 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకునేవారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో...
సైన్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్’ అవార్డు అందుకుంది కవిత. గోరీచెన్ పర్వతారోహణ సందర్భంగా తోటి పర్వతారోహకురాలికి చికిత్స చేసినందుకు రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్‌కు ఎంపికైంది. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించింది.
– కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం