అదిగో తోట... ఇవిగో చెట్లు

Massive corruption in polavaram land acquisition - Sakshi

      పోలవరం భూసేకరణలో భారీ అక్రమాలు 

     తెలుగుదేశం పార్టీ కీలక నేతలు,ఉన్నతాధికారుల కుమ్మక్కు 

     భూమిని సేకరించే మండలాల్లో అనుకూలురైన అధికారుల నియామకం 

     కొండలు గుట్టలతో నిండిన భూములను మామిడి, కోకో, పామాయిల్‌ తోటలుగా చిత్రీకరణ 

     భూమితోపాటు ఫల సాయం ఇచ్చే చెట్ల పేరుతోనూ అధిక మొత్తంలో పరిహారం స్వాహా 

     ఏడువేల ఎకరాల సేకరణలో రూ.వందల కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కులు 

పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు బినామీల రూపంలో టీడీపీ ముఖ్య నేతలు ఓ వైపు ఫోర్జరీలతో చెలరేగిపోగా.. మరోవైపు గిరిజనుల ‘భూమికి బదులు భూమి’ విషయంలో మరోలా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారు. ఈ బాగోతంలో.. లేని తోటలను ఉన్నట్లు రికార్డుల్లో చిత్రీకరించారు. అంతేకాదు.. భారీఎత్తున ఫలసాయం వస్తున్నట్లు నమ్మించారు. రూ. వందల కోట్ల ప్రజాధనాన్ని మింగేసిన ఈ తతంగంలో ‘పచ్చ’ నేతల దోపిడీ పర్వం ఇలా సాగింది..  

ఇదిగో ఈ ఫొటో చూశారా.. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి చెరువు ఇది. సర్వే నెంబరు 371/1లో 11.80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇది చెరువు కాదట. ఆ భూమిలో కొబ్బరితోట ఉందట. పెద్దల ఒత్తిడితో చెరువును కొబ్బరితోటగా మార్చేసిన అధికారులు.. ఆ భూమి టీడీపీ నేత కాకర్ల చంద్రశేఖర్‌కు చెందినట్లుగా రికార్డులు మార్చారు. దానితోపాటు సర్వే నెంబరు 372/1లో 5.42, 372/2లో 3.32, 422లో 7.16 ఎకరాలు వెరసి 27.7 ఎకరాల భూమికి, లేని కొబ్బరి చెట్లకు, బోరు బావులకు కలిపి మొత్తం రూ.3,67,69,669లను పరిహారంగా మంజూరు చేశారు.  

పోలవరం ముంపు గ్రామాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: ఐదు కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం తమ జీవితాల్లో చీకట్లు నింపుకున్న గిరిజనుల త్యాగాలను అధికార పార్టీ కీలక నేతల అక్రమార్జన అపహాస్యం చేస్తోందనడానికి ఇది మరో తార్కాణం. భూ సేకరణ చట్టం–2013, పీసా (పంచాయత్స్‌ ఎక్సెటెన్షన్‌ టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌) చట్టం–1996 ప్రకారం.. భూములు కోల్పోయిన గిరిజనులకు గరిష్ఠంగా ఐదు ఎకరాల భూమిని సర్కార్‌ ఇవ్వాలి. గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచడం కోసం వారు కోల్పోయిన భూములకు బదులు మామిడి తోటలు.. కోకో తోటలు.. పామాయిల్‌ తోటలు.. మూడు పంటలు పండే సారవంతమైన మాగాణి భూములను సేకరించి వారికి కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజంలేదు. అధికార పార్టీ కీలక నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కై మామిడి తోటలు.. కోకో తోటలు.. పామాయిల్‌ తోటలు లేకపోయినా ఉన్నట్లు రికార్డులు సృష్టించి.. అధిక మొత్తంలో పరిహారం పొందుతూ.. కమీషన్లు దండుకుంటున్నారు. అవే భూములను గిరిజనులకు కేటాయిస్తున్నారు. కానీ.. తమకు కేటాయించిన భూముల్లో మామిడి తోటలు కాదు కదా కనీసం ఒక్క చెట్టు కూడా కన్పించకపోవడంతో గిరిజనులు నిర్ఘాంతపోతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రూ.150 కోట్లకుపైగా ప్రజాధనాన్ని అధికార పార్టీ కీలక నేతలు కొల్లగొట్టేశారు.  

మాటలకు చేతలకు పొంతనేదీ? 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1,61,857.01 ఎకరాల భూమి అవసరం. ఇందులో 1,39,859.68 ఎకరాల భూమి  జలాశయంలో ముంపునకు గురవుతుంది. పోలవరం భూసేకరణ పరిహారం ఎలా అందిస్తారంటే.. ఒక గిరిజనుడికి 7 ఎకరాలు ఉంటే.. 5 ఎకరాల వరకు భూమికి భూమి ఇస్తారు. రెండు ఎకరాలకు పరిహారం ఇస్తారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉంటే పరిహారంతో పాటు అంతో ఇంతో భూమి అందిస్తారు. దీనికోసం పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ప్రాంతాల్లో సర్కార్‌ భూములు కొనుగోలు చేస్తోంది.  
గ్రామ గ్రామానికో దళారీ 
ఈ ప్రక్రియపైనా అధికార పార్టీ కీలక నేతలు, ప్రజాప్రతినిధుల కళ్లు పడ్డాయి. భూసేకరణ చేసే మండలాల్లో తమకు అనుకూలురైన రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, అటవీ శాఖ అధికారులను నియమించుకున్నారు. గ్రామ గ్రామంలోనూ అధికార పార్టీ నేతలను దళారీలుగా మార్చుకుని అక్రమాలకు తెరతీశారు. భూసేకరణ కోసం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ (డీఎన్‌)ను జారీ చేయకముందే మామిడి తోటలు లేకున్నా ఉన్నట్లు.. కోకో తోటలు లేకున్నా సాగు చేస్తున్నట్లు.. పామాయిల్‌ తోటలు కన్పించకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. భూమితోపాటూ చెట్లకు పరిహారం మంజూరు చేయించుకుని.. భారీఎత్తున లబ్ధిపొందడానికి ఎత్తులు వేశారు. ఇదే వ్యూహంతో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. ఆ మేరకు పరిహారాన్ని మంజూరు చేస్తూ సర్కార్‌ డీడీ (డ్రాఫ్ట్‌ డిక్లరేషన్‌)ని జారీచేసింది. 

ఈ ఫొటో చూడండి.. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి వద్ద నిర్వాసితుల ఇళ్ల కోసం తొలగించిన వెదురు బొంగులు. సరిగ్గా లెక్కపెడితే 300లోపు ఉంటాయి. కానీ.. సర్వే నెంబరు 371/1లో 11.81, 372/1లో 5.43, 372/2లో 3.33, 422లో 7.17 వెరసి 27.74 ఎకరాల భూమిలో 9,250 వెదురు గుంపులు, టేకు చెట్లు ఉన్నట్లు చూపి రూ.4,16,78,278 పరిహారాన్ని టీడీపీ నేత భార్య కాకర్ల భాగ్యలక్ష్మికి అప్పనంగా మంజూరు చేశారు. పరిహారం చెల్లించాక.. సేకరించిన ఆ భూమిలో ఉన్న వృక్ష సంపద ప్రభుత్వానికే చెందాలి. నిర్వాసితులకు కేటాయిస్తే సంబంధిత గిరిజనులకు చెందాలి. కానీ.. వీటిని సంబంధిత భూ యజమానులే అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. 

దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. 
లేని తోటలను ఉన్నట్లు చూపి రూ. వందల కోట్లు కాజేశారు
గిరిజనులకు భూమికి బదులు భూమి ఇవ్వడానికి ఇప్పటికే 7,459 ఎకరాలను సేకరించారు. ఈ భూములకు ఇప్పటివరకూ రూ.864 కోట్ల మేర పరిహారం చెల్లించారు. అందులో లేని తోటలను ఉన్నట్లు చూపి రూ.150 కోట్లకుపైగా కాజేశారు. ఉదాహరణకు.. 
- బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలో గిరిజనులకు భూమికి బదులు భూమి ఇవ్వడానికి రూ.89.90 కోట్ల వ్యయంతో 737.96 ఎకరాలను సేకరించారు. ఇందులో అధిక శాతం భూమి బోరు బావుల కింద ఆరు తడి పంటలు పండే భూమే. ఈ భూమిలో ఎక్కడా మామిడి తోటలు లేవు. సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో.. అదీ భూసేకరణ నోటిఫికేషన్‌ వెలువడానికి ముందు పామాయిల్‌ చెట్లను హడావుడిగా నాటారు. ఆ తర్వాత వాటిని కూడా తీసేశారు. కానీ.. ఈ భూముల్లో పామాయిల్, మామిడి తోటలు, వెదురు, టేకు తదితర చెట్లు ఉన్నట్లు చూపి అధిక మొత్తంలో పరిహారం పిండుకున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేత కాకర్ల సురేష్‌ చక్రం తిప్పినట్లు గిరిజన కౌలు రైతు సంఘం అధ్యక్షుడు కారం వాసు తెలిపారు.  
- అలాగే, జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలో తాడువాయి, చల్లావారిగూడెం, మంగిశెట్టిగూడెం గ్రామాల పరిధిలో గిరిజనులకు భూమికి బదులుగా భూమి ఇవ్వడం కోసం తొలి విడతగా 711 ఎకరాల భూమిని రూ.159.97 కోట్లతో సేకరించడానికి నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈ భూమిలో కూడా ఎక్కడా కోకో తోటలే లేవు. అయితే, పామాయిల్‌ తోటల్లో కోకో తోటలు ఉన్నట్లు రికార్డుల్లో చూపించారు. కానీ.. ఆ మూడు గ్రామాల్లో ఎక్కడా కనీసం ఒక్క కోకో చెట్టు కూడా లేకపోవడం గమనార్హం. మామిడి తోటలు, పొగాకు బ్యారన్లు ఉన్నట్లు రికార్డులు సృష్టించి, భారీఎత్తున ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఈ వ్యవహారంలో ఉండవల్లి సోమసుందర్‌ అనే టీడీపీ నేత చక్రం తిప్పారని రైతులు చెబుతున్నారు.  
- జీలుగుమిల్లి మండలం దర్భగూడెం, పి.నారాయణపురం, రౌతుగూడెం, స్వర్ణవారిగూడెం, ములగలంపల్లి, రామన్నగూడెంలలో కూడా గిరిజన నిర్వాసితుల కోసం 2621.2 ఎకరాల భూమిని రూ.524.42కోట్ల వ్యయంతో సేకరించారు. ఇందులో దర్భగూడెంలో సర్వే నెంబరు 294/1, 294/2లో 3.14 ఎకరాల భూమి ఉంది. ఇది పూర్తిగా కంకర క్వారీ భూమి. కానీ.. కేతిరెడ్డి రాఘవరెడ్డి అనే టీడీపీ నేత ఈ భూమిలో అప్పటికప్పుడు బోరువేసి, పామాయిల్‌ చెట్లు నాటించి.. రూ.65 లక్షలకుపైగా పరిహారాన్ని సొమ్ము చేసుకున్నాడు. జీలుగుమిల్లి గ్రామంలో సర్వే నెంబరు 89/4బీలో 1.83 ఎకరాలు చాకలి మాన్యం భూమిని, సర్వే నెంబరు 134/2లో 9.32 ఎకరాల మాదిగల మాన్యం భూమిని పసుపులేటి వెంకటరామయ్య అనే టీడీపీ నేత తనకు చెందినట్లుగా రికార్డులు సృష్టించి రూ.99.42 లక్షలు మింగేశాడు.

గిరిజనులకు ద్రోహం చేశారు  
దర్భగూడెంలో దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను 1/70 (భూబదలాయింపు నిషేధం) చట్టాన్ని తుంగలో తొక్కి.. పీసా కమిటీలో తీర్మానించకుండా సర్కార్‌ సేకరించింది. సాగులో ఉన్న గిరిజనులను కాదని గిరిజనేతరులైన టీడీపీ నేతలకు పరిహారం ఇచ్చారు. దీనిపై గిరిజనులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను భూసేకరణ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ భూములను కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో నిర్వాసితులైన గిరిజనులకు భూమికి బదులు భూమి కింద సర్కార్‌ కేటాయిస్తోంది. సాగులో ఉన్న గిరిజనులకు.. నిర్వాసితులైన గిరిజనులకు మధ్య సర్కార్‌ చిచ్చు పెడుతోంది. గిరిజనులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ద్రోహం చేయడం దారుణం. 
– ఊక సూర్యచంద్ర, పీసా కమిటీ సభ్యుడు, దర్భగూడెం, జీలుగుమిల్లి మండలం 

హైకోర్టు తీర్పు బేఖాతరు 
జీలుగుమిల్లి మండలంలో పాములవారిగూడెం, దర్భగూడెం, స్వర్ణవారిగూడెం తదితర ప్రాంతాల్లో గిరిజనుల భూములను గిరిజనేతరులు ఆక్రమించుకున్నారు. సాగులో గిరిజనులు ఉన్నా.. రికార్డులు గిరిజనేతరుల పేర్లతో సృష్టించారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించాం. ఆ భూములను సేకరించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ అధికారులు ఏకపక్షంగా భూములను సేకరించి.. టీడీపీ నేతలకు పరిహారం ఇచ్చారు. గిరిజనులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలను టీడీపీ నేతలు మింగేశారు. 
–గుజ్జు గంగాధర్, పాములవారిగూడెం, జీలుగుమిల్లి మండలం 

మా మధ్య చిచ్చుపెడతారా? 
గుర్రప్పగూడెంలో 75 ఎకరాల భూమిని మా గూడెంలోని గిరిజనులు సాగు చేసుకుంటున్నాం. మాకు పట్టాలు కూడా ఉన్నాయి. ఈ భూములు మావంటూ కొందరు గిరిజనేతరులు పేచీ పెడితే.. ట్రైబల్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాం. ట్రైబల్‌ ట్రిబ్యునల్‌ మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ.. టీడీపీ పెద్ద నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మేం సాగుచేసుకుంటున్న భూములను సేకరించారు. రూ.8.50 కోట్లకుపైగా పరిహారాన్ని టీడీపీ నేతలు మింగేశారు. ఈ భూములను వేలేరుపాడు మండలం చిగురుమామిడికి చెందిన గిరిజనులకు కేటాయించారు. వారు మా భూములను స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నారు. అన్నదమ్ముల్లా బతుకుతున్న గిరిజనుల మధ్య సర్కార్‌ చిచ్చుపెట్టింది. 
–యు. వెంకటేష్, గుర్రప్పగూడెం, బుట్టాయిగూడెం 

నిలువునా ముంచేశారు  
గుర్రప్పగూడెం, దొరమామిడిలో గిరిజనులమైన మేము భూములు సాగుచేసుకుంటున్నాం. పట్టాలు కూడా ఉన్నాయి. మా భూముల రికార్డులను తారుమారు చేసి.. స్థానిక టీడీపీ నేతలు పట్టాలు సృష్టించి మమ్మల్ని నిలువునా మోసం చేశారు. 
–కోరం సంక్రు, గుర్రప్పగూడెం, బుట్టాయిగూడెం.

ప్రభుత్వమే మోసం చేస్తే ఇంక ఎవరికి చెప్పుకోవాలి? 
గిరిజన హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే మోసం చేస్తే మేం ఇంక ఎవరికి చెప్పుకోవాలి? మేం సాగు చేసుకుంటున్న భూములను మాకు తెలియకుండానే టీడీపీ నేతలు భూసేకరణ కింద అధికారులకు అప్పగించేసి పరిహారం కాజేశారు. ఈ భూములను వేలేరుపాడు మండలంలో నిర్వాసితులకు కేటాయించారు. మేం ఎవరినీ రానివ్వం.  
–ఉడత లక్ష్మణరావు, గుర్రప్పగూడెం, బుట్టాయిగూడెం మండలం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top