అనారోగ్యంతో ఉన్న కోడలికి వైద్యం చేయించాల్సిన అత్తింటి వారే ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.
కోడలిపై కిరోసిన్ పోసిన అత్త
చిట్టినగర్ : అనారోగ్యంతో ఉన్న కోడలికి వైద్యం చేయించాల్సిన అత్తింటి వారే ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కేఎల్‌రావునగర్ ప్రాంతానికి చెందిన చంద్రకళ 11 ఏళ్ల కిందట గొట్టిపర్తి కిరణ్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి వల్లి పద్మ(9) మహిమ తేజస్వి(5). పిల్లలు ఉన్నారు. పదేళ్ల పాటు సవ్యంగా సాగిన వీరి కాపురంలో ఏడాది నుంచి గొడవలు మొదలయ్యాయి. చంద్రకళకు ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో పాటు భార్య పిల్లలను పట్టించుకుకోకుండా కిరణ్‌కుమార్ తన తల్లి దగ్గరకు వెళ్లేపోయేవాడు. ఆటో నడిపే కిరణ్ మూడు నెలలుగా ఇంటి అద్దె కూడా చెల్లించకపోవడంతో యజమాని గదికి తాళం వేశాడు. దీంతో చంద్రకళ కలరా హాస్పటల్ వద్ద ఉంటున్న తన అక్క దగ్గర ఉంటుంది.
ఇదేక్రమంలో కిరణ్‌కుమార్ తాత గారు రాసిన వీలునామా ప్రకారం కోట్ల రూపాయల ఆస్తి కలిసి రావడంతో చంద్రకళకు వేధింపులు ఎక్కువయ్యాయి. సోమవారం ఉదయం హాస్పటల్‌కు వెళ్లేందుకు సిద్ధమైన చంద్రకళ తన మందుల కాగితాలను తెచ్చుకునేందుకు కేటీరోడ్డులోని చిట్టి పార్కు ఎదురుగా ఉన్న అత్త సాయికుమారి వాళ్ల ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కిరణ్‌కుమార్ తన సోదరులైన ఏసురాజు, ప్రసాద్‌లతో కలిసి చంద్రకళతో గొడవకు దిగారు. దీంతో ఆవేశంతో అత్త సాయికుమారి చంద్రకళ ఒంటిపై కిరోసిన్ పోయడంతో భయంతో కేకలు వేసింది. స్థానికులతోపాటు చంద్రకళ సోదరి ఆమెను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఫిర్యాదు స్వీకరించేందుకు పోలీసులు అంగీకరించలేదు. బాధితురాలి కుటుంబీకులు స్టేషన్ ఎదుట ఆందోళన చేసేందుకు సిద్ధం కావడంతో ఫిర్యాదు స్వీకరించడమే కాకుండా కిరణ్‌కుమార్, అతని తల్లి, సోదరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో పాటు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.