మావోల అలికిడి | Sakshi
Sakshi News home page

మావోల అలికిడి

Published Mon, Jan 18 2016 12:59 AM

Maoists in West Agency

సాక్షి ప్రతినిధి, ఏలూరు :సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా సాగుతున్న  కోడిపందేలు, గుండాట, పేకాటలను నిలువరించే పనిలో కొందరు పోలీసులు.. అదే అదనుగా రూ.లక్షలు ఆర్జించేపనిలో మరికొందరు ఖాకీలు కొద్దిరోజులుగా నిమగ్నమైపోయారు. సరిగ్గా ఇదే సమయంలో పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒక వర్గానికి చెందిన మావోయిస్టులు ఇటీవల కొంతకాలం వరకు పశ్చిమ ఏజెన్సీలోనే మకాం వేసి, అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు తరలిపోయారు. కానీ పదిరోజుల కిందట తిరిగి తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమగోదావరి అటవీ ప్రాంతంలోకి వచ్చినట్టు తెలుస్తోంది.
 
  సుమారు 12 మంది సాయుధులైన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలిసింది. వీరు రెండు దళాలుగా పశ్చిమ ఏజెన్సీలో సంచరిస్తున్నారని, అధునాతన ఆయుధాలు కలిగి ఉన్నారని చెబుతున్నారు. దొరమామిడి, కన్నాపురం, బుట్టాయగూడెం తదితర ప్రాంతాలకు చెందిన  రైతులను, పత్తి వ్యాపారులను పిలిపించి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. సరిగ్గా భోగిరోజు ముందు పోగొండ రిజర్వాయర్ సమీపంలో సంచరించిన మావోలు దొరమామిడికి చెందిన రైతులను అలివేరు పిలిపించి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. అదేవిధంగా బుట్టాయగూడెంలోని కొంతమంది పత్తి వ్యాపారులకు కూడా ఇదే మాదిరి కబురంపి డబ్బులు తీసుకున్నారని చెబుతున్నారు.
 
 కామయ్యకుంట, లంకపల్లి, మంగయ్యపాలెం, తెల్లదిబ్బల ప్రాంతాల్లో కూడా మావోలు  సంచరిస్తున్నట్టు తెలిసింది. ఏజెన్సీ మారుమూల గ్రామాలతోపాటు మైదాన ప్రాంతంలోని కొంతమంది వ్యాపారుల నుంచి కూడా వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టులు సంచరిస్తున్న విషయం నిఘా వర్గాల దృష్టికి కూడా వెళ్లినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎక్కడా మావోల అలికిడే లేదంటూ పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చినప్పుడల్లా రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పదేపదే ప్రకటలు చేస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా జిల్లా అంతటా సంక్రాంతి సంబరాల్లో మునిగిన వేళ ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో మావోయిస్టుల అలికిడి పోలీసువర్గాల్లోనూ కలకలం రేపుతోంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement