కూలీగా వెళ్లి.. విగతజీవిగా మారి

Man Died In Chennai - Sakshi

బూర్జ శ్రీకాకుళం : బతుకుతెరువు కోసం ఊరు కాని ఊరు వెళ్లిన ఆ కార్మికుడు ప్రమాదానికి గురై విగతజీవిగా మారారు. 15 రోజుల క్రితం గ్రామంలో అందరితో ఆనందంగా గడిపి వినాయకచవితికి వస్తానని చెప్పిన ఆయన.. అంతలోనే మృత్యువాత పడ్డారు. మండలంలోని కె.కె.రాజపురం గ్రామానికి చెందిన వలస కూలీ కుప్పిలి దుర్గారావు(42) చెన్నైలో ఆదివారం మృతి చెందారు. ఈ నెల 14న స్వగ్రామమైన కె.కె.రాజపురం నుంచి అక్కడికి వెళ్లారు.

ఆయన కుటుంబ సభ్యులు అక్కడ ఉండటంతో వెంటనే పనిలో చేరాడు. 19వ తేదీన మూడు అంతస్తుల భవనంలో పనిచేస్తున్నారు. మరో ఆరగంటలో పని ముగుస్తుందనగా సీట్‌ సెంట్రింగ్‌ తీస్తున్నాడు. ఇంతలో ప్రమాదవశాత్తూ కాలుజారి పైనుంచి కిందికి మెట్లు ఉన్న సందులోకి పడి పోయారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. ఇనుప రాడ్లు కూడా గుచ్చుకుపోయాయి. తోటి కూలీలు వెంటనే అక్కడ ఆస్పత్రిలో చేర్చారు. 11 రోజులుగా వైద్యం అందిస్తున్నారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. 

కె.కె.రాజపురంలో విషాదఛాయలు

దుర్గారావు గాయపడ్డారని తెలియగానే భార్య లక్ష్మి, కుమారుడు యోగేశ్వరరావు హుటాహుటిన చెన్నై వెళ్లారు. కుమార్తె స్వాతి కె.కె.రాజపురంలో ఉంటోంది. ఆమె డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన దుర్గారావు చెన్నైలో మృతి చెందిన వార్త తెలియటంతో కె.కె.రాజపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నిరంతరం కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న దుర్గారావు 15 రోజులకు ముందు గ్రామంలో తోటి మిత్రులందరితో మంచిగా ఉంటూ సరదాగా గడిపి వినాయక చవితికి వస్తానని చెప్పారు. అనేక మంది మిత్రులు, బంధువులు చెన్నై వెల్లి పరామర్శించి వచ్చారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో దుర్గారావు మృతి చెందటం పలువురికి కలిచి వేసింది. మృతుడి తల్లి కుప్పిలి లక్ష్మి, కుమార్తె స్వాతి, మేనమామలు బోరున విలపిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top