దగాపడ్డ రైతు | Make YSRCP's Maha Dharna a big success | Sakshi
Sakshi News home page

దగాపడ్డ రైతు

Dec 5 2014 1:07 AM | Updated on Jul 25 2018 4:07 PM

దగాపడ్డ రైతు - Sakshi

దగాపడ్డ రైతు

ఏలూరు :పశ్చిమ రైతు మరోసారి దగా పడ్డాడు. అప్పులే పెట్టుబడిగా పెట్టి చివరికి కన్నీళ్ల దిగుబడితో కొన్నేళ్లుగా సాగు చేస్తున్న జిల్లాలోని అన్నదాతలు

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :పశ్చిమ రైతు మరోసారి దగా పడ్డాడు. అప్పులే పెట్టుబడిగా పెట్టి చివరికి కన్నీళ్ల దిగుబడితో కొన్నేళ్లుగా సాగు చేస్తున్న జిల్లాలోని అన్నదాతలు చంద్రబాబునాయుడు రుణమాఫీ ఉచ్చులో చిక్కుకుని ఇప్పుడు విలవిల్లాడిపోతున్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే రుణమాఫీని అమలు చేస్తామన్న బాబు మాటలు విని పట్టం కట్టిన రైతన్నలు, మహిళలు తీరా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్నెల్లుగా పూటకో మాట.. గడియకో విధానం చూస్తూ దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. రుణమాఫీ పేరిట రైతులు, మహిళల పట్ల సర్కారు వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టరేట్‌ల వద్ద శుక్రవారం రైతు మహాధర్నా చేయూలని పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు గురువారం హడావుడిగా చేసిన ప్రకటన రైతులను గందరగోళంలో పడేసింది. రూ. 50 వేల లోపు ఉన్నవారికి ఒకేసారి రుణమాఫీ చేస్తామని, పదో తేదీ నుంచి ఈ ప్రక్రియ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రూ.50వేల పైన ఉంటే.. ఇరవై శాతం ఇచ్చి తర్వాత మిగిలిన మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో వడ్డీతో సహా కడతామని పేర్కొన్నారు.
 
 జిల్లాలో సగానికి సగం ఖాతాల్లో కోత
 జిల్లాలో 8.50 లక్షల మంది రైతులకు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు ఉన్నాయి. వీటిలో 5.60 లక్షల రైతుల ఖాతాలు పరిశీలించి పంపాలని తహసిల్దార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆధార్, రేషన్ కార్డుల వివరాలను ముడిపెడుతూ 33 కాలమ్స్ ఉన్న ఫారం నింపాలన్న నిబంధనతో చాలామంది రైతులు సకాలంలో వివరాలు ఇవ్వలేకపోయారు. ఈ సాకుతో జిల్లాలోని 92 వేల మంది ఖాతాలకు సర్కారు కోత పెట్టింది. ఇక సరైన వివరాలు ఇచ్చిన ఖాతాలనూ పరిగణనలోకి తీసుకోలేదు.
 
 అనంతపల్లి ఆంధ్రాబ్యాంక్ అధికారులు తమ శాఖలో రుణమాఫీకి అర్హులైన ఖాతాలు 2200 ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే 942 మందిని మాత్రమే తొలి విడత కింద అర్హులైన వారిగా పేర్కొంది. కన్నాపురం ఆంధ్రాబ్యాంక్‌లో 2500 మంది రైతులకు రుణ ఖాతాలు ఉండగా, ప్రభుత్వం మాత్రం 800 ఖాతాలే రుణమాఫీకి అర్హమైనవని స్పష్టం చేసింది. ఎర్నగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2800 ఖాతాలు రుణమాఫీకి అర్హమైనవి ఉంటే కేవలం 356 మంది రైతులే అర్హులని, ఆచంట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ 860 ఖాతాలు పంపిస్తే 362 ఖాతాలే అర్హమైనవని పేర్కొంది. ఇక గున్నంపల్లి సొసైటీకి సంబంధించి 474 ఖాతాలు పంపిస్తే.. తొలి జాబితాలో 377మందినే అర్హులుగా గుర్తించారు. ఈ లెక్కన చూస్తే జిల్లాలో కేవలం 40 శాతం మంది రైతులనే రుణమాఫీకి అర్హులుగా సర్కారు పేర్కొన్నట్టు స్పష్టమవుతోంది.
 
 రూ.50 వేల లోపు రుణాలు ఎన్ని?
 చంద్రబాబు తాజాగా ప్రకటించిన 50 వేల లోపు రుణాలు ఒకేసారి రద్దు ప్రకటన కూడా జిల్లా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో రూ.50వేల లోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య చాలా తక్కువని తెలుస్తోంది. 50వేల పైన ఒక్క రూపాయి ఎక్కువగా ఉన్నా ఇప్పుడు కేవలం 20 శాతం మాత్రమే మాఫీ అవుతుందని, మిగిలిన లెక్క ఎప్పుడు తేలుతుందో స్పష్టత లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 మాకూ తెలీదు : ఎల్‌డీఎం లక్ష్మీనారాయణ
 జిల్లాలో యాభైవేల లోపు వ్యవసాయ రుణాలు తీసుకున్నవారు ఎంతమంది ఉన్నారు.. మిగిలినవారికి బాండ్లు ఏ విధంగా ఇస్తారన్న సమాచారం నా వద్ద కూడా లేదు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) అధికారుల వద్దే ఈ సమాచారం ఉంటుంది. జిల్లా కలెక్టర్ కూడా నన్ను అడుగుతున్నారు... కానీ నాకూ తెలియడం లేదని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనారాయణ గురువారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
 
 డ్వాక్రా రుణాలదీ అదే దారి..
 గడువులోగా డ్వాక్రా రుణాలు చెల్లిస్తే ఒక్క రూపాయి కూడా వడ్డీ పడదని, ఇప్పుడు జాప్యం కారణంగా వివిధ బ్యాంకులను బట్టి 13 నుంచి 15 శాతం వడ్డీ పడుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో డ్వాక్రా రుణాలు రూ. వెయ్యికోట్లకు పైగా ఉన్నాయి. డ్వాక్రా రుణాలనూ మాఫీ చేస్తానని, కానీ ఎప్పుడనేది  తర్వాత మాట్లాడతానన్న సీఎం ఆ రుణాలపై వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందా అనేదానిపై  స్పష్టతనివ్వలేదు.
 
 అయోమయంలో కౌలు రైతులు
 జిల్లాలో రెండున్నర లక్షలమంది కౌలు రైతులు ఉన్నారు. గతేడాది వీరిలో  54 వేలమందికి రూ.138 కోట్ల రుణాలిచ్చారు. కౌలు రైతు గుర్తింపు కార్డులున్న వారికే రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రైతుమిత్ర గ్రూపుల్లో ఉన్న వారిపై ఆయన స్పష్టతనివ్వలేదు. దీంతో జిల్లాలోని కౌలు రైతులందరికీ రుణ మాఫీ వర్తిస్తుందా లేదా ఇంకా పజిల్‌గానే ఉంది. వాస్తవానికి ప్రభుత్వపరంగా తమకు ఇచ్చిన రుణం తక్కువని అది మాఫీ చేసేందుకు సిద్ధం కాకపోవడం బాధాకరమని కౌలురైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 బీమా సొమ్ము పాతబాకీల్లో జమ
 ఖరీఫ్‌లో వచ్చిన తుపాన్లు కారణంగా ఒక లక్షా 13 వేల 452 మంది రైతులు పంట నష్టాలు చవిచూశారు. దీనికి ప్రభుత్వం ఇటీవలే రూ. 120 కోట్లు విడుదల చేసింది. అయితే ఒకపక్క రుణమాఫీ సొమ్ము జమ కాక, రానున్న రబీకి బీమా సొమ్ము ఉపయోగించుకోవడానికి కూడా వీలు లేకుండా వాటిని వాణిజ్య బ్యాంకులు, సొసైటీలు కూడా తమ ఖాతాల్లోకి జమ వేసుకోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
 
 నేడు ఏలూరులో మహాధర్నా
 రుణమాఫీ కొర్రీతో  రైతన్నలు, మహిళలనే కాదు.. నిరుద్యోగ భృతి కల్పిస్తామని యువతను, వెయ్యిరూపాయల పెన్షన్ ఇస్తామంటూ సగానికి సగం మంది లబ్ధిదారులను తగ్గించి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను దారుణంగా వంచించిన చంద్రబాబు సర్కారు విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉదయం పదిగంటల నుంచి మహాధర్నా నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీని గెలిపించిన పశ్చిమ రుణం తీర్చుకోలేనిదంటూ చెబుతున్న బాబుకు శుక్రవారం నాటి ధర్నాతో సర్కారుపై ఇక్కడి ప్రజల ఆగ్రహం ఎలా ఉందో అర్థం కానుందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, వేలాదిమంది తరలివచ్చే ధర్నాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
 
 ఘోరంగా వంచించారు
 రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఘోరంగా వంచించారు.రేషన్, ఆధార్, ఇతర పత్రాలు లేకుండానే రుణమాఫీ చేస్తానని చెప్పి తీరా వడపోతకు అవన్నీ ఉపయోగించి రైతులను నట్టెట ముంచారు.  
 - డేగా ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి
 కౌలు రైతుల రుణాన్ని మాఫీ చేయాలి
 
 కౌలు రైతులందరికీ ప్రభుత్వం ఐడీ కార్డులు ఇవ్వలేదు. ఇవ్వని కౌలు రైతులు రైతుమిత్ర గ్రూపు ద్వారా రుణాలు పొందారు. రాష్ట్రంలో కౌలు రుణాలు రూ.160 కోట్లని బ్యాంకర్లు అంటున్నారు. ఈ మొత్తాన్ని మాఫీ చేయాలి.  
 - కె.శ్రీనివాస్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
 
 హామీలు తుంగలో తొక్కారు
 ఎన్నికల్లో షరతులు, రుణపరిమితి లేకుండా అందరికీ రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రైతుల నడ్డివిరిచారు. రూ. 50 వేల లోపు రుణమాఫీ వల్ల చిన్న, సన్నకారు రైతులకు మేలు జరగదు.  
 - మంతెన సీతారాం, సీపీఎం జిల్లా కార్యదర్శి
 
 పూర్తి రుణామాఫీ కావాలి
 రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతులు 83 లక్షల మంది ఉన్నారని ఎన్నికలప్పుడు చెప్పారు. ఇప్పుడు 23 లక్షల మందికి మాఫీ అంటున్నారు. దీనిలో ఏది నిజం. వెంటనే రుణమాఫీ అమలు చేసి రైతులను ఆదుకోవాలి.  
 -బి.బలరాం, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement