ఫలించిన మొక్కజొన్న రైతుల పోరాటం

Maize Farmers Agitation Became Successful - Sakshi

నష్టపరిహారం చెల్లించేందుకు సీపీ కంపెనీ అంగీకారం

ఎకరాకు రూ.62, 500 చెల్లింపు

ఆందోళనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే ప్రతాప్‌

మీర్జాపురం(నూజివీడు): మొక్కజొన్న రైతులు మంగళవారం నాటి నుంచి చేపట్టిన ఆందోళనతో కంపెనీ దిగొచ్చి నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో రైతులు గురువారం ఆందోళన విరమించారు. రైతుసంఘం ఆధ్వర్యంలో 30 గంటల పాటు జరిగిన ఆందోళనతో ఎకరాకు రూ.62,500 చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు సీపీ కంపెనీ అంగీకరించింది. దాదాపు 5వేల ఎకరాలలో మొక్కజొన్న సాగుచేయగా, కంపెనీ చెప్పిన విధంగా దిగుబడులు రాకపోగా, పూర్తిగా నష్టపోయారు.

మద్దతుగా ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు..

నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్న రైతులకు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు మద్దతుగా నిలిచారు. మీర్జాపురంలోని సీపీ సీడ్‌ కంపెనీ వద్ద ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి చర్చించారు. ఆ తరువాత కంపెనీ ఆర్గనైజర్లతోను, ప్రతినిధితోను మాట్లాడారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నష్టపరిహారం ఎంతిస్తారో తేల్చాలని, లేనిపక్షంలో నూజివీడు– హనుమాన్‌జంక్షన్‌ రోడ్డుపై రైతులతో కలసి ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ప్రతాప్, పోలీసు అధికారులతోను, తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు.

ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి డీఎస్పీ బమ్మిడి శ్రీనివాసరావు రావడంతో ఎమ్మెల్యే ప్రతాప్‌ మాట్లాడుతూ రైతులు ఎకరాకు రూ.90వేలు నష్టం పరిహారం అడుగుతున్నారని, అసలు ఎంతిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆర్గనైజర్లు, కంపెనీ ప్రతినిధులతో తహసీల్దార్‌ తేజేశ్వరరావు, డీఎస్పీ, సీఐలు పలుమార్లు చర్చించి, నష్టపరిహారాన్ని ప్రకటించాలని సూచించారు. చివరకు ఎకరాకు రూ.62,500 నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు పగడాల వెంకట ఆంజనేయులు, నిమ్మగడ్డ నరసింహా, గరిశేపల్లి రాజు, చిటికెల రామారావు  పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top