శ్రీశైలం జలాశయంలో 854 అడుగులు కనీస నీటి మట్టాన్ని కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈమేరకు కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు గురువారం శ్రీశైలం డ్యాంను ముట్టడించారు.
శ్రీశైలం డ్యామ్ ముట్టడిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల డిమాండ్
శ్రీశైలం: శ్రీశైలం జలాశయంలో 854 అడుగులు కనీస నీటి మట్టాన్ని కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈమేరకు కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు గురువారం శ్రీశైలం డ్యాంను ముట్టడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాయలసీమ రైతుల హక్కుల పరిరక్షణకు ప్రాణాలకైనా తెగించి పోరాడుతామని హెచ్చరించారు. రైతన్నల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.
కార్యక్ర మంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి (శ్రీశైలం), ఎస్వీ మోహన్‌రెడ్డి (కర్నూలు), గౌరు చరితారెడ్డి (పాణ్యం), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), ఐజయ్య (నందికొట్కూరు), మణిగాంధీ (కోడుమూరు), బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి (డోన్), చాంద్‌బాషా (క దిరి), విశ్వేశ్వరరెడ్డి (ఉరవకొండ), మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, బుడ్డా శేషారెడ్డి, రైతు సంఘం నాయకులు దశరథరామిరెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు నిమ్మకాయల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది రైతుల జీవన్మరణ సమస్య
- వై. విశ్వేశ్వరరెడ్డి , ఎమ్మెల్యే, ఉరవకొండ
అనంతపురం జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో రాయలసీమకు ప్రాధాన్యమివ్వాలి. ఇక్కడ ఉన్న కాల్వలకు నీరు విడుదల చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ 800 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చునని చెప్పినా 400 టీఎంసీల నీటినే వినియోగించుకుంటూ మిగిలిన నీటిని కృష్ణా బ్యారేజ్ కింద వదిలేస్తున్నారు. ఇప్పటి వరకు కట్టిన కొత్త ప్రాజెక్టులన్నీ వైఎస్సార్ ఫలితమే. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఉత్పాదన పేరుతో డ్యామ్ కనీస నీటిమట్టాన్ని 788కి తగ్గించడం బాధాకరం. రైతులకు ఇది జీవన్మరణ సమస్య కావడంతో శ్రీశైలం ముట్టడి కార్యక్రమం చేపట్టాం.
కనీస నీటి మట్టం పునరుద్ధరించే వరకు ఉద్యమం
- చాంద్‌బాషా, ఎమ్మెల్యే, కదిరి
శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని యథావిథిగా 854 అడుగులకు పునరుద్ధరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతోంది. మొన్నటి వరకు వివిధ పార్టీల వారంతా తాము రైతు పక్షాన నిలబడుతామని చెప్పిన వారే. ఈ రోజు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన ముట్టడికి పిలిస్తే రాలేదు. అఖిలపక్షానికి చెందిన ఏ ప్రజాప్రతినిధి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులు మద్దతు తెలపకపోతే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని బీడు భూమిగా మార్చేస్తుంది. ఇకనైనా సీమ రైతులు, ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా పోరాడాలి.
రుణ మాఫీలో సీఎం విఫలం
నందికొట్కూరు: ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు నాయుడు రైతులను నట్టేట ముంచారని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. శ్రీశైలం డ్యాం ముట్టడి కార్యక్రమానికి వెళ్తూ గురువారం ఆయన కర్నూలు జిల్లా నందికొట్కూరులో విలేకరులతో మాట్లాడుతూ రుణ మాఫీ చేయడంలో సీఎం ఘోరంగా విఫలమయ్యారన్నారు.