
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనకు సంబంధించి జరుగుతున్న విచారణపై విశాఖ పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. నిందితుడు శ్రీనివాసరావుకు ఎలాంటి అస్వస్థత లేదని ఆయన తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఈ రోజు జనరల్ చెకప్ మాత్రమే చేశామని అన్నారు. అతనికి మూడు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని.. ఎస్‌బీఐ, విజయ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ ఘటనతో సంబంధమున్న 35 మందిని విచారించినట్టు వెల్లడించారు. శ్రీనివాసరావు మాత్రం విచారణకు సహకరించడం లేదని తెలిపారు.
పోలీస్ కస్టడీలో శ్రీనివాసరావు సురక్షితంగా ఉంటాడని.. కస్టడీలో ఉండగా అతనికి ఎలాంటి ముప్పు ఉండదని లడ్డా అన్నారు. శ్రీనివాస్ స్నేహితులు మధ్యప్రదేశ్, ఒడిశాలలో ఉండటంతో.. పోలీసు బృందాలను అక్కడికి పంపినట్టు తెలిపారు. కాగా, ఈ రోజు శ్రీనివాసరావును వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. ఆ సమయంలో నిందితుడు తనకు ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యలు చేశాడు.