ప్రేమజంట ఆత్మహత్య | Love the twin suicide | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

Oct 28 2013 1:08 AM | Updated on Nov 6 2018 7:53 PM

మంచినీటి బావిలోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆగిరిపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వడ్లమాను పంచాయతీ పరిధిలోని...

ఆగిరిపల్లి, న్యూస్‌లైన్ : మంచినీటి బావిలోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆగిరిపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వడ్లమాను పంచాయతీ పరిధిలోని ఆగిరిపల్లి శోభనాచలస్వామి కొండ ప్రాంతానికి చెందిన ఆరుమేకల రమేష్ (22), నూజివీడు మండలం పాతరావిచర్లకు చెందిన మరీదు లక్ష్మీప్రసన్న(18) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. రమేష్ గతంలో రావిచర్లకు చెందిన మరీదు రామ్మోహనరావు పొక్లెయిన్‌పై డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆ క్రమంలో అదే గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్నతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గతంలో ఒకసారి వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోగా బంధువులు పట్టుకుని లక్ష్మీప్రసన్నను మందలించారు. డ్రైవర్‌గా రమేష్‌ను తొలగించారు.
 
వేరే  వ్యక్తితో పెళ్లి నిశ్చయించారని...


లక్ష్మీప్రసన్నకు ప్రస్తుతం వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం లక్ష్మీప్రసన్న ఇంటినుంచి పరారైంది. ఆమెకు తండ్రి లేకపోవడంతో మేనమామ, బంధువుల స హాయంతో రెండురోజులుగా గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం శవమై కనిపించింది. స్థానిక మెట్ల కోనేరు వాటర్‌ట్యాంక్ వద్దనున్న మంచినీటి బావి వద్దకు వచ్చిన స్థానికులకు చెప్పులు, బైక్, దుస్తుల బ్యాగ్ కనిపించాయి. అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా, గాలింపు చేపట్టారు. మంచినీటి బావిలో వీరిద్దరూ చున్నీతో కట్టుకుని శవాలుగా కనిపించారు.

చావులో సైతం విడిపోకూడదనే ఉద్దేశంతో ఒక్కటిగా ఆత్మహత్యకు పాల్పడ్డారని చూపరులు కంటతడి పెట్టారు. మృతదేహాలను చూసి ఇరు కుటుంబాల వారు కన్నీరుమున్నీరయ్యారు. రాత్రి 11 గంటల సమయం లో ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. వీఆర్వో ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై టి.చంద్రశేఖర్ ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
రూ.5 వేలిస్తేనే పోస్టుమార్టం...

నూజివీడు రూరల్ : పోస్టుమార్టం నిర్వహించాలంటే ఒక్కొ క్క మృతదేహానికి రూ.5 వేలు చొప్పున ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాస్పత్రి డ్యూటీ డాక్టర్ జి.ఉమేష్ డిమాండ్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి సోదరుడు ఆరుమేకల రాజేష్, బంధువు పులపాక రమేష్, మోదుగు రాజు కథనం ప్రకారం రమేష్, లక్ష్మీప్రసన్నల మృతదేహా లను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం ఉదయం 11 గంటల ప్రాంతంలో తరలించారు. డబ్బిస్తేనే పోస్టుమార్టం చేస్తానని డాక్టర్ తేల్చిచెప్పారని వివరించారు. తాము పేద కుటుంబానికి చెందినవారమని, అంత ఇచ్చుకోలేమని చెప్పినా కనికరం చూపలేదని, సాయంత్రం నాలుగు గంటల వరకు కాలయాపన చేసి తమను ఇబ్బంది పెట్టారని తెలిపారు. అసలే మనిషి చనిపోయి బాధపడుతున్న తమకు ఈ ఘటన మరింత క్షోభకు గురిచేసిందని వాపోయారు. నాలుగున్నర గంటల సమయంలో వైద్యశాలకు వచ్చిన సూపరింటెండెంట్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లినా స్పం దించలేదని పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో మీడియా సమక్షంలో నగదు చెల్లిస్తామని చెప్పామని, దీంతో ఆగ్రహానికి గురైన వైద్యుడు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారని వివరిం చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.
 
రాతపూర్వక ఫిర్యాదిస్తే చర్యలు...

 మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించటానికి డాక్టర్ జి.ఉమేష్ డబ్బు డిమాండ్ చేశారన్న విషయమై వైద్యశాల సూపరింటెండెంట్ ఆర్.నరేంద్రసింగ్‌ను వివరణ కోరగా,  బాధితులు తన వద్దకు వచ్చి విషయం తెలిపారని, ఎవరికీ నగదు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పానని తెలిపారు. బాధితులు రాతపూర్వక ఫిర్యాదిస్తే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement