అడవి బిడ్డల ఆనందం

Lockdown: Tribal Families Happy For AP Government Ration - Sakshi

బుట్టాయగూడెం: రెక్కాడితేగానీ డొక్కాడని పేద గిరిజనులకు లాక్‌డౌన్‌ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సాయం కొండంత అండగా నిలిచింది. లాక్‌డౌన్‌ కారణంగా ముఖ్యంగా మారుమూల కొండరెడ్డి గిరిజనుల ఉపాధి కష్టతరంగా మారే పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రకటించిన సాయం వారికి వరంలా మారింది. ఫలితంగా అడవి బిడ్డలు రెండుపూటలా పట్టెడన్నం తింటున్నారు. కరోనాపై సరైన అవగాహన లేకున్నా గిరిపల్లెలు లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నాయి. ఎవరూ గడప దాటి బయటకు రావడం లేదు. తమ గ్రామాల్లోకీ ఎవరినీ రానివ్వడం లేదు. గ్రామ పొలిమేరల్లో గిరిజనులు వెదురు తడికలతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రోజుకు నలుగురు చొప్పున కాపలా ఉంటున్నారు.

ఈ పరిస్థితుల్లో  ప్రభుత్వం అందించిన బియ్యం, కందిపప్పు, రూ.1,000 పేదలకు వరంలా మారింది.  గ్రామ వలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు వల్ల మారుమూల దట్టమైన కొండకోనల్లో బాహ్య ప్రపంచానికి దూరంగా నివసిస్తున్న గిరిజనులకు సైతం సకాలంలో సాయం అందింది. దీంతో కష్టకాలంలో ప్రభుత్వం అందించిన సహాయం మర్చిపోలేనిదని గిరిజనులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

గిరిజన ప్రాంతమైన  పోలవరం నియోజకవర్గంలో 1,00,377 మంది తెల్ల రేషన్‌కార్డుదారులకు సుమారు 5,400 టన్నుల 875 కేజీల బియ్యం, 57,058 కేజీల కందిపప్పు పంపిణీ అయింది.  వీటితోపాటు  రూ. 1000 చొప్పున సుమారు రూ. 10,03,77,000 సొమ్ము నేరుగా లబి్ధదారులకు చేరింది. మారుమూల కుగ్రామాలకు సైతం ఒక్క రోజులోనే సాయం అందిందని, ఇది ఒక చరిత్ర అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా గిరిజనులకు అండగా నిలుస్తున్నాయి.     

ప్రభుత్వం అండగా నిలిచింది 
కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచింది. బియ్యం, కందిపప్పు, రూ.1000 ఇవ్వడం వల్ల వాటితోనే పూట గడుపుకుంటూ జీవిస్తున్నాం. అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇవ్వడం వల్ల కష్టకాలాన్ని ఎదుర్కోగలుగుతున్నాం. ప్రభుత్వానికి, దాతలకు కృతజ్ఞతలు.
– పూసం భీముడు,  కొండరెడ్డి గిరిజనుడు   

రేషన్‌ బియ్యంతో పొట్టపోసుకుంటున్నాం   
మాయదారి రోగం కరోనా కారణంగా పని లేకుండా పోయింది. దీంతో అందరూ ఇళ్లల్లోనే ఉండే పరిస్థితి నెలకొంది. భయంతో బయటకు వెళ్లలేకపోతున్నాం. ఈ పరిస్థితుల్లో కుటుంబ జీవనం కష్టతరంగా మారింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన రూ.1000, బియ్యం, కందిపప్పుతోనే పొట్ట పోసు కుంటున్నాం. కష్టకాలంలో ప్రభుత్వ సాయం మరువలేనిది.  – సవలం ముత్యాలమ్మ, గిరిజనురాలు, గొల్లగూడెం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top