మనమే ఫస్ట్


అక్షరాస్యతలో ‘పశ్చిమ’కు అగ్రస్థానం

 జిల్లాలో 74.32 శాతం అక్షరాస్యత నమోదు

 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ టాప్

 జాతీయ స్థాయిలో 31వ స్థానం

 జాతీయ, రాష్ట్ర సగటులోనూ ఆధిక్యం

 నూరు శాతం అక్షరాస్యతకు ప్రత్యేక కార్యక్రమం


 

 ఏలూరు సిటీ : విద్య, వైద్య, రాజకీయ, సామాజిక రంగాల్లో ముందుంటూ.. అన్ని రంగాల్లోనూ చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న మన జిల్లా అక్షరాస్యతలోనూ ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. 74.32 శాతం అక్షరాస్యత సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా తలెత్తుకుని నిలబడింది. పొరుగునే ఉన్న కృష్ణా జిల్లా 73.74 శాతంతో రెండో స్థానంలోను, 72.36 శాతంతో చిత్తూరు జిల్లా మూడో స్థానంలోను నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లా 65.5 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. ఇదిలావుంటే.. జాతీయ స్థాయిలో మన జిల్లాకు 31వ స్థానం దక్కింది.

 

 జాతీయ, రాష్ట్ర సగటు అక్షరాస్యతతో పోల్చినా అంతకంటే ఎక్కువ అక్షరాస్యత సాధించి ముందు వరుసలో ఉంది. జాతీయ సగటు అక్షరాస్యత 72.98 ఉండగా.. రాష్ట్ర సగటు 67.35గా నమోదైంది. ఈ రెండింటినీ తలదన్నుతూ మన జిల్లాలో సగటు అక్షరాస్యత 74.32గా నమోదైంది. కేంద్రం ప్రకటించిన తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి.మహిళలూ ఓకే.. జిల్లాలో మహిళల అక్షరాస్యతా శాతం 71.05 ఉండగా, పురుషుల శాతం 77.63గా ఉంది. మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసం 6.58 గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే కృష్ణాజిల్లా పశ్చిమతో పోటీ పడుతూ సమీపంలో కొనసాగుతుం డగా, విజయనగరం జిల్లా కింది వరుసలో ఉంది.

 

 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ..

 గ్రామీణ, పట్టణ ప్రాంతాల అక్షరాస్యతలోనూ ఇతర జిల్లాల కంటే మన జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత సగటు 71.8గా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో సగటు 80.3గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యత 67.3, పురుషుల సగటు 76.3గా ఉండగా, వారిమధ్య వ్యత్యా సం 9.04గా నమోదైంది. పట్టణ ప్రాం తాల్లో మహిళల అక్షరాస్యత 75.7 కాగా, పురుషుల సగటు 85.1 కాగా, వ్యత్యాసం 9.36 శాతంగా ఉంది.

 

 నూరు శాతం సాధించేందుకు కసరత్తు

 జిల్లాలో నిరక్షరాస్యుల సంఖ్య 4 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వ సర్వే తేల్చిం ది. తొలిదశలో లక్షన్నర మందిని అక్షరాస్యులను చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. వయోజన విద్యశాఖ అక్షరాస్యత కార్యక్రమానికి సంబంధించి పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తుండగా, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ఇందుకోసం 5వేల మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘాల నాయకులు నిరక్షరాస్యులకు చదువు చెప్పేలా చర్యలు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top