అందరి నోటా అదేమాట.. వికేంద్రీకరణే ముద్దు

Leaders and people saying that only development with the decentralization of governance - Sakshi

ఊరూవాడా హోరెత్తిన నినాదాలు

రాష్ట్రమంతటా భారీ ర్యాలీలు.. ప్రదర్శనలు

కదం తొక్కిన విద్యార్థులు, యువత, ప్రజా సంఘాలు 

చంద్రబాబుపై మండిపాటు 

పాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్న నేతలు, ప్రజలు

‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? సామాజిక న్యాయం జరగకూడదనుకుంటున్నారా? అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావాలన్నదే మీ ఉద్దేశమా? వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందంటే అడ్డుపడతారా? మీ స్వార్థం కోసం.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం అభివృద్ధి అంతా అమరావతిలోనే జరగాలనడం న్యాయమా? ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ మీరు చేసిందేమిటి? రాష్ట్రాభివృద్ధి గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? గ్రాఫిక్స్‌తో చుక్కలు చూపించడం తప్ప ఏం చేశారు? ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సృష్టించుకోవడం తప్ప సామాన్య ప్రజానీకానికి ఏ విధంగానైనా లబ్ధి కలిగించారా?’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయనకు వంతపాడుతున్న ఎల్లో మీడియాపై నిప్పులు చెరిగారు.

పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్న శివరామకృష్ణన్, జీఎన్‌రావు కమిటీలు, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదికలను అమలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ‘మీ హయాంలో ఎవరికీ మేలు చేయలేదు.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పుణ్యమా అని మేలు జరగబోతుంటే సైంధవుడిలా అడ్డుపడుతున్నారు’ అంటూ ధ్వజమెత్తారు. బాబు తీరును నిరసిస్తూ అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. తీరు మారకపోతే మా ప్రాంతాల్లో అడుగు పెట్టలేరంటూ హెచ్చరించారు. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం సబబుకాదని హితవు పలికారు. 

సాక్షి, విశాఖపట్నం: విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేయాలన్న నినాదాలు హోరెత్తాయి. నగరంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు జిల్లా అంతటా శుక్రవారం భారీ ర్యాలీలు జరిగాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ అన్నివర్గాల ప్రజలు నినదించారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలు ర్యాలీ జరిపారు. అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, గాజువాక, మాడుగుల నియోజకవర్గాల్లో ప్రజలు కదం తొక్కారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి పరిసరాల్లో తన బినామీల ఆస్తులను కాపాడుకోవడానికే మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.  

పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి
వదరయ్యపాళెం/పలమనేరు/శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా సత్యవేడులో మహిళలు, విద్యార్థులు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి మూడు రోడ్ల కూడలిలోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పూతలపట్టు తదితర నియోజకవర్గాల్లో ర్యాలీలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. సత్యవేడులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ.. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే.. చంద్రబాబుకు వచ్చిన బాధేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే కళావతి  

అన్నింటికీ అమరావతే అనడం సరికాదు
పాలన వికేంద్రీకణ జరగాలని ఆకాంక్షిస్తూ ‘తూర్పు’గోదావరి జిల్లా అంతటా శుక్రవారం ఉద్యమం ఊపందుకుంది. అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, ఎన్‌సీసీ, స్కౌట్‌ విద్యార్థులు ఎర్రవంతెన నుంచి హైస్కూల్‌ సెంటర్‌ వరకూ ర్యాలీలో పాల్గొన్నారు. తునిలో ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్‌ నుంచి కోటిపల్లి బస్టాండ్‌ వరకూ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాజమహేంద్రవరాన్ని సాంస్కృతికంగా అభివృద్ధి చేస్తామని గృహనిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుపేర్కొన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ తదితరులు కోటిపల్లి బస్టాండ్‌ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి బైఠాయించారు. రామచంద్రాపురంలో ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మహిళలతో ర్యాలీ నిర్వహించారు.
అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న యువత  

ఒకే సామాజిక వర్గానికి న్యాయం చేస్తారా?
కడప కార్పొరేషన్‌: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కడప ఆర్టీసీ బస్టాండ్‌ కూడలిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అమరావతి పేరిట ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు నాయుడు కేవలం తన సామాజిక వర్గం ప్రయోజనాలను కాపాడటానికే మూడు రాజధానుల అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్సార్‌ స్టూడెంట్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఆలూరు ఖాజా రహమతుల్లా విమర్శించారు.   

రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దు
అనంతపురం: అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ జరగాలని కోరుతూ అనంతపురంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ మేరకు కలెక్టర్‌ గంధం చంద్రుడుకు విద్యార్థులు వినతిపత్రం సమర్పించారు. గిరిజన విద్యార్థి సంఘం, ఎంఐఎం విద్యార్థి సంçఘం, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్‌ తిప్పేస్వామి, ప్రాథమిక విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సీఈఓ సాంబశివారెడ్డి మద్దతు ప్రకటించారు. హిందూపురంలో టీడీపీ వైఖరిపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు ప్రాంతాల అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఆందోళనలను అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. 

థ్యాంక్యూ.. సీఎం
కర్నూలు (రాజ్‌విహార్‌): కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిస్తూ కర్నూలు నగరంలోని రాజ్‌విహార్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘థ్యాంక్యూ సీఎం జగన్‌ సర్‌’ అంటూ నినదించారు. కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన పాణ్యం, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్‌ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేశారు.  నంద్యాల, దేవనకొండ, ఆస్పరి, ఆలూరు, మంత్రాలయంలో ర్యాలీ చేపట్టారు.  

సమగ్రాభివృద్ధి కోరుతూ..
పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ విజయనగరం జిల్లావ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ర్యాలీలు హోరెత్తాయి. విజయనగరం మూడు రోడ్ల జంక్షన్‌లో మానవ హారం నిర్వహించారు. బొబ్బిలి, కురుపాం, పార్వతీపురం, సాలూరు, కొత్తవలస, భోగాపురంలో ర్యాలీలు జరిగాయి. నెల్లూరు రూరల్, ఆత్మకూరు పట్టణం, చేజెర్ల, సంగం, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పోడూరు, ఏలూరు నగరం, ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలం బాదంపూడి తదితర ప్రాంతాల్లో బైక్, కార్ల ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, డీసీసీబీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ యడ్ల తాతాజీ, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, ఎంఆర్‌డీ బలరాం, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కొట్టు విశాల్‌ మద్దతు పలికారు.  శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు, చర్చాగోష్టులు నిర్వహించారు. సోంపేటలో‘అధికారం–అభివృద్థి–వికేంద్రీకరణ’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో.. ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మేధావుల ఫోరం చెబుతోందని స్పష్టం చేశారు. టెక్కలిలో ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారన్నారు. అమరావతిలో భూములు కొన్న నాయకులే దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top