బెండపూడి జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రెండు బైకులను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిన సంఘటనలో బెండపూడికి చెందిన
తొండంగి : బెండపూడి జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రెండు బైకులను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిన సంఘటనలో బెండపూడికి చెందిన ఇద్దరు మృత్యువాతపడగా, మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బెండపూడి గ్రామానికి చెందిన గోపిశెట్టి నారాయణరావు (40) ఓ ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్‌గా పనిచేస్తుండగా, పాపాన రాము (30) బెండపూడి శివారు సుబ్బరాయపురం సమీపంలో దాబా నిర్వహిస్తుంటారు. అయితే పుష్కరాల సందర్భంగా సెలవులు కావడంతో నారాయణరావు రత్నగిరిపై తాత్కాలికంగా మైక్ అనౌన్సర్‌గా, రాము సత్యదేవుని నమూనా ఆలయం ఎదురుగా తాత్కాలికంగా హోటల్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు.
రాము తన బైక్‌పై సతీష్ అనే వ్యక్తిని, నారాయణరావు తన బైక్‌పై సింహాచలాన్ని ఎక్కించుకున్నారు. రెండు బైక్‌లపై నమూనా ఆలయం వద్ద హోటల్‌కు బయలుదేరారు. వీరంతా బెండపూడి వైపు నుంచి అన్నవరం బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా వై జంక్షన్ దాటిన తర్వాత వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. నారాయణరావు, రాము అక్కడికక్కడే మృతి చెందగా, సతీష్, సింహాచలం తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 అంబులెన్స్‌లో కాకినాడ ఆస్పత్రికి తరలించారు. లారీ వేగంగా రావడంతో రామును సుమారు 25 మీటర్లు ఈడ్చుకు పోయింది. బైకులు నుజ్జయ్యాయి. రాముకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నారాయణరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతి చెందినవారి కుటుంబీకులు సంఘటన స్థలంలో రోదించిన తీరు కలచివేసింది. తొండంగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను తుని ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.