
సాక్షి, అమరావతి : ఉండవల్లి లాంటి వారంతా పేపర్ టైగర్లు, యాక్షన్ టైగర్లు కాదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎద్దేవా చేశారు. అమరావతి బాండ్లపై ఉండవల్లి చాలా హేళనగా మాట్లాడటం దారుణమన్నారు. 2 వేల కోట్ల రూపాయల బాండ్లు ఇష్యూ కావడంతో చాలా మందికి ఈర్ష్య, ద్వేషాలు పెరిగాయని.. అందుకే ఇలా చవకబారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తెచ్చిన వడ్డీ రేటు కన్నా తక్కువ వడ్డీ రేటుకు ఎవరు బాండ్లు తెచ్చినా అరేంజ్డ్ ఫీజు భారీగా ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం 2 లక్షల కోట్ల అప్పు చేసిందని ఉండవల్లి ఆరోపించడం తగదన్నారు. ప్రజలకు ఆర్థిక అంశాల మీద ఉండదనుకొని... అబద్ధాలతో వారిని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని కుటుంబరావు ఆరోపించారు. సెబీ కింద గుర్తింపు పొందిన సంస్థలే బిడ్డింగ్‌లో కోట్ చేశాయని స్పష్టం చేశారు.