కృష్ణమ్మ గలగల..

Krishna Water Flows To Rajoli Dam In Kadapa - Sakshi

శ్రీశైలం నుంచి జిల్లాకు కృష్ణాజలాలు

రాజోలి ఆనకట్టకు ప్రవాహం

రాజోలి నుండి నీరు విడుదల చేసిన మైదుకూరు ఎమ్మెల్యే

సాక్షి, కడప : అనుకున్న సమయం కంటే ముందే కృష్ణా జలాలు జిల్లాకు ముందుగానే చేరా యి. ఎగువన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఇది సాధ్యపడింది. శుక్రవారం తెల్లవారుజామున 4.00 గంటల ప్రాంతంలో జిల్లా సరిహద్దులోని రా జోలి ఆనకట్టకు నీరు చేరింది. మధ్యాహ్నం 3.00 గంటల సమయానికి మూడు వేల క్యూసెక్కుల నీరు చేరింది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి కేసీ కెనాల్‌ అధికారులు పూజలు చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. మైదుకూరు ప్రధాన కాలువకు 600 క్యూసెక్కులు, మిగిలిన నీటిని కుందూ నదిలోకి విడుదల చేశారు. శని వారం సాయంత్రానికి కృష్ణా జలాలు ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు చేరనున్నాయి. రోజురోజుకు నీటి విడుదల పెరగనుండడంతో కేసీ పరిధిలోని అన్ని కాలువలకు విడుదల చేయనున్నారు. జిల్లాకు కృష్ణా జలాలు చేరడం పట్ల కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఎంతో ఊరట..
కేసీ పరిధిలో కడప, కర్నూలు జిల్లాల పరిధిలో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది..మనజిల్లా పరిధిలో 92 వేల ఎకరాలు అధికార ఆయకట్టు ఉంది. కేసీ కెనాల్‌ నీటితో అనధికారికంగా మరో 50 వేల ఎకరాల ఆయకట్టుకు చేరే పరిస్థితి ఉంది. దీంతోపాటుగా భూగర్బ జలాలు పెరిగి బోరు బావుల్లో పుష్కలంగా నీరు అందుబాటులోకి వస్తుందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఎగువన వరద కొనసాగుతుండడంతో ఈ ఏడాది పది టీఎంసీల నీటిని కేసీకి తరలించే అవకాశం ఉంది. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో కరువుతో అల్లాడుతున్న రైతాంగానికి ఎగువన వర్షాలు కురిసి జిల్లాకు కృష్ణా జలాలు చేరడం ఉపశమనంగా మారింది. బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ నుండి శుక్రవారం సైతం దాదాపు ఏడు వేల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. నాలుగు రోజులుగా రోజురోజుకు నీటి విడుదల పెరగడంతో అధికారులు అనుకున్న సమయం కంటే కృష్ణా జలాలు జిల్లాలో అడుగు పెట్టాయి. ఎగువన భారీ వర్షాలతో శ్రీశైలంకు వరద కొనసాగుతోంది.  పోతిరెడ్డిపాడు నుండి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, అంతే స్థాయిలో నీటిని బనకచర్ల హెడ్‌ రెగ్యులర్‌ నుండి వైఎస్సార్‌ కడపజిల్లాలోని నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ప్రధానంగా కేసీ కెనాల్‌తోపాటు తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేశారు. పది రోజుల్లో గాలేరు–నగరి ద్వారా గండికోటతోపాటు తెలుగుగంగ ప్రాజెక్టుకు సైతం కృష్ణా జలాలు రానున్నాయి. ఇవి త్వరితగతిన చేరుతుండడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

శ్రీశైలంకు 193 టీఎంసీల నీరు
ఎగువ నుండి 3,42,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు 193.67 టీఎంసీల (891 అడుగులు) నీరు చేరింది.

రాజోలి నాడు..

గతేడాది ఆగస్టు 11న రాజోలిలో అడుగంటిన నీటి ప్రవాహం

శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కేసీ రైతాంగ సాగునీటి ప్రదాయిని రాజోలి వద్ద ప్రవహిస్తోంది. గతేడాది ఇదే నెలలో వెలవెలబోయిన రాజోలి ఆనకట్టలో నేడు కృష్ణా జలాలు పారుతున్నాయి. శుక్రవారం రాజోలి వద్ద కుందూనదిలో 2500 క్యూసెక్కులు, మైదుకూరు కేసీ ప్రధాన కాలువలోకి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 1.45లక్షల ఎకరాలకు సాగునీరు అందించే రాజోలి వద్ద జలకళ సంతరించుకోవటంతో యావత్‌ రైతాంగం హర్షిస్తోంది.    – చాపాడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top