
కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేశామని, రాబోయే రోజుల్లో కృష్ణా-పెన్నా నదుల్ని అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
సాక్షి, విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేశామని, రాబోయే రోజుల్లో కృష్ణా-పెన్నా నదుల్ని అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరిలో నిల్వలు పెరిగితే ఆ నీటిని కృష్ణా నదికి తీసుకువస్తామని, కృష్ణా నీటిని శ్రీశైలం వద్ద నిల్వచేసి రాయలసీమకు పంపుతామని వివరించారు. శనివారం విజయవాడలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో సమగ్ర జలవనరుల నిర్వహణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కాడా టెక్నాలజీ ద్వారా 13 జిల్లాల్లోని నీటిపారుదల ప్రధాన ప్రాజెక్టులతో అనుసంధానం చేసిన వీడియో కాన్ఫరెన్స్ థియేటర్‌ను బాబు ఆవిష్కరించారు.
రోడ్డుపై గొయ్యి ఉంటే ఇంజనీర్‌పై వేటే
రాష్ట్రంలోని రోడ్లపై ఎక్కడ గోతులు కనిపించినా ఊరుకునేది లేదని, సంబంధించి ఇంజనీర్‌ను పిలిచి అక్కడికక్కడే చర్యలు తీసుకుంటానని సీఎం శనివారం జరిగిన ఆర్‌అండ్‌బీ సమీక్షలో హెచ్చరించారు. వాహనంలో ప్రయాణించే వారి మొబైల్ ఆధారంగా ఆ వాహన వేగాన్ని కనుగొనే విధానాన్ని గూగుల్ సంస్థ తమకు అందిస్తోందని తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
తెలంగాణలో అనుమతి లేకుండా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరిం చాల్సిన వ్యూహంపై ఏపీ సీఎం చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమా, సుప్రీంకోర్టు న్యాయవాది గంగూలీ, నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం చర్చించారు. తెలంగాణ ప్రాజెక్టులు, రాష్ట్రాల మధ్య జల వివాదాలు, కృష్ణా రివర్ బోర్డు వ్యవహారం, ఏపీలో చేపట్టే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఈ సందర్భంగా చర్చించారు.