‘దివి’ గుండెచప్పుడు వైఎస్‌!

Krishna District Diviseema's Heart Beat Is YSR - Sakshi

దివిసీమలోనే ఆధునికీకరణకు మహానేత అంకురార్పణ 

విజయవాడ డబుల్‌ లైన్‌ కరకట్టకు అడగకుండానే నిధులు

వైఎస్‌ హయాంలోనే సముద్ర కరకట్ట పటిష్ట చర్యలు 

సాక్షి, అవనిగడ్డ: దివిసీమ ప్రజల గుండెలో మహానేత వైఎస్‌ సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఆధునికీకరణ పనుల ద్వారా సాగునీటి కష్టాలు తొలగించి, రైతులకు వందేళ్ల భరోసా ఇచ్చేందుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. అడగకుండానే విజయవాడ – పులిగడ్డ డబుల్‌ లైన్‌ కరకట్టకు నిధులు మంజూరు చేశారు. దివిసీమలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసి చెరగని ముద్ర వేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2006 నవంబర్‌ 2వ తేదీన ఓగ్ని తుఫాన్‌ ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి అవనిగడ్డ వచ్చారు.

60 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుంభవృష్టి వర్షాలు పడ్డాయి. ఈ వర్షపాతం కంటే 25 శాతం అధికంగా వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డెల్టాను ఆధునికీకరిస్తానని వైఎస్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన డెల్టా ఆధునికీకరణకు రూ.4,576 కోట్లు మంజూరు చేశారు. 2008 జూన్‌ 6న అవనిగడ్డ మండలం పులిగడ్డ వార్పు వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. 150 ఏళ్ల కృష్ణా డెల్టా చరిత్రలోనే అత్యధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రిగా వైఎస్‌ చరిత్ర పుటల్లో నిలిచారు. 

చిత్తరువుని చూసి మురిసిన వైఎస్‌..
కృష్ణా జిల్లాలో రూ.2,180 కోట్లు, అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.547.93 కోట్లు డెల్టా ఆధునికీకరణ పనులు జరిగాయి. పులిగడ్డ వార్పు వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకంపై వైఎస్‌ పలుగు పట్టుకుని గాతవేస్తున్న ప్లాస్టరాఫ్‌ ప్యారిస్‌ చిత్తరువు మహానేతను అచ్చుగుద్దినట్టు ఉంటుంది. శంకుస్థాపన మహోత్సవానికి వచ్చిన వైఎస్‌ తన చిత్తరువుని చూసి ఎంతో మురిసిపోయారు. 

అడగకుండానే దివిసీమకు వరాలు
దివిసీమకు వైఎస్‌ అడగకుండానే ఎన్నో వరాలు అందించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.590 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. రాష్ట్రంలోనే తొలి ఫిషరీస్‌ కళాశాలను నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. రూ.35 కోట్లతో అవనిగడ్డలో 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు వైఎస్‌ హయాంలోనే జరిగింది. రూ.40 కోట్లతో నాగాయలంక మండలం గుల్లలమోద నుంచి కోడూరు మండలం సాలెంపాలెం వరకూ సముద్ర కరకట్టను అభివృద్ధి చేశారు. అశ్వరావుపాలెం – మందపాకల పంట కాల్వ ఏర్పాటుతో పాటు, జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు దివిసీమ ప్రజల గుండెల్లో వైఎస్‌కు చెరగని ముద్ర వేశాయి.

ఉల్లిపాలెం వారధికి అప్పుడే అంకురార్పణ.. 
ఉల్లిపాలెం – భవానీపురం వారధికి వైఎస్‌ హయాంలోనే అంకురార్పణ జరిగింది. ఈ వారధి కోసం రూ.32 కోట్లకు ప్రతిపాదనలు ఆమోదించారు. ఈ వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వైఎస్‌ సమాయత్తమవగా ఎన్నికల కోడ్‌ రావడంతో కార్యక్రమం నిలిచిపోయింది. ఆ తర్వాత పలు దఫాలుగా అంచనాలు పెంచి వారధిని నిర్మించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top