
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోని దద్దమ్మల పార్టీ టీడీపీ అని ఆంధ్రప్రదేశ్ టెక్నాలిజీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. విశాఖపట్నంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తే.. అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తులు విమర్శలు చేయడం తగదన్నారు. పార్టీలు మారిన సబ్బం హరికి.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత లేదని ఆయన మండిపడ్డారు.
కంచరపాలెంలో సబ్బం హరి చేసిన చిల్లర పనులు ఇంకా జనం గుర్తుంచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని నట్టేట ముంచి.. సబ్బంహరి అభ్యర్థుల నుంచి డబ్బులు దోచుకున్నాడని ప్రసాద్‌రెడ్డి దుయ్యబట్టారు. పార్టీ ఫండ్‌లు, అభ్యర్థుల నిధులు మింగేసిన ఘన చరిత్ర సబ్బం హరిది ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన అనుచరుల ఆస్తులు పోతాయనే ఉద్దేశంతో రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని కొయ్యప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు.