
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో సాక్షాత్తూ రాష్ట్ర ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జగరడం.. తీవ్ర సంచలనం రేపుతోంది. సెల్ఫీ నెపంతో వైఎస్ జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాస్ అనే వెయిటర్ కోడిపందాలలో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. అసలు ఈ శ్రీనివాస్ ఎవరు? ఎందుకు వైఎస్ జగన్‌పై హఠాత్తుగా దాడి చేశాడు? అత్యంత భద్రత ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంలోపలికి అసలు కత్తి ఎలా వచ్చింది? తనిఖీలను తప్పించుకొని.. కోళ్ల పందాలకు వాడే పదునైన కత్తిని అతను లోపలికి ఎలా తీసుకొచ్చాడు? అతనికి సహకరించింది ఎవరు? దీనిలో రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా? అన్న అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ నేతకు నిందితుడు సన్నిహితుడు..
వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాస్‌ది అమలాపురం సమీపంలోని ముమ్మిడివరం అని తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ల్యాంజ్ క్యాంటీన్ యాజమాని హర్షవర్ధన్‌కు అతను సన్నిహతుడని సమాచారం. హర్షవర్థన్ అధికార టీడీపీ నాయకుడు కావడం గమనార్హం. అతను గతంలో గాజువాక టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ పెద్దల సిఫార్సుతోనే అతనికి ఎయిర్‌పోర్టు క్యాంటీన్ కాంట్రాక్ట్ వచ్చింది. అతని క్యాంటీన్‌లోనే పనిచేస్తున్న శ్రీనివాస్ భద్రత తనిఖీల కళ్లుగప్పి కత్తిని ఎలా లోపలికి తీసుకొచ్చాడు? అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. సమగ్ర దర్యాప్తు జరిగితే తప్ప ఈ ఘటనకు వెనక ప్రేరేపణ ఏమిటి? కుట్ర ఏమిటి? అన్నది తెలియదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు భద్రతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్‌పోర్టు లోపలికి ఓ వ్యక్తి కత్తి ఎలా తీసుకెళ్లాడు? ఎయిర్‌పోర్టులోకి కత్తి తీసుకురావడానికి అతనికి సహకరించిందెవరు? తనిఖీ చేయకుండా భద్రతా సిబ్బంది అతన్ని లోపలికి ఎలా పంపించారు? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.