సీఎం పేషీ ఖాళీ ! | kiran kumar reddy office going to be empty ! | Sakshi
Sakshi News home page

సీఎం పేషీ ఖాళీ !

Feb 17 2014 1:36 AM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం పేషీ ఖాళీ ! - Sakshi

సీఎం పేషీ ఖాళీ !

గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. సంప్రదాయాలకు పూర్తిగా తిలోదకాలు ఇస్తూ ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్లిపోయే సమయంలో హోల్‌సేల్‌గా ఐఏఎస్‌ల బదిలీలకు శ్రీకారం చుడుతున్నారు.

 సంప్రదాయాలకు సీఎం తిలోదకాలు
 చివరి దశలో ఐఏఎస్‌ల హోల్‌సేల్ బదిలీలు
 తనతో పాటే పేషీ అధికారులను ఖాళీ చేయించడానికి రంగం సిద్ధం
 వారి కోసం నెలల తరబడి     కీలక శాఖలు ఖాళీ
 ఇప్పుడు ఆ శాఖలకు ఈ అధికారుల బదిలీ
 
 సాక్షి, హైదరాబాద్: గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. సంప్రదాయాలకు పూర్తిగా తిలోదకాలు ఇస్తూ ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్లిపోయే సమయంలో హోల్‌సేల్‌గా ఐఏఎస్‌ల బదిలీలకు శ్రీకారం చుడుతున్నారు. అంతే కాకుండా తనతోపాటే సీఎం పేషీలోని అధికారులను కూడా ఖాళీ చేయించాలనే ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారు.

గతంలో ఏ ముఖ్యమంత్రి పదవీకాలం ముగిసినా పేషీలోని ఐఏఎస్ అధికారులను అంతకు ముందే ఇతర శాఖలకు బదిలీ చేసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా తన పేషీని మొత్తం ఖాళీ చేయించాలని కిరణ్ కంకణం కట్టుకున్నారు. గతంలో రోశయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ అందుకు ముందే పేషీలోని అధికారులను ఎవరినీ బదిలీ చేయలేదు. సాధారణంగా తరువాత వచ్చే ముఖ్యమంత్రి తన ఇష్టానుసారం పేషీలోని అధికారులను నియమించుకుంటారు.
 
  కొత్తగా వచ్చే ముఖ్యమంత్రికి అప్పటి వరకు కొనసాగిన విషయాలపై ప్రాథమిక అవగాహన కల్పించడానికి అంతకు ముందు కొనసాగిన పేషీ అధికారులే ఉంటారు. అయితే తన పేషీలో పనిచేసిన అధికారులెవరూ కూడా ఇంకో ముఖ్యమంత్రి పేషీలో ఉండరాదనేది కిరణ్‌కుమార్‌రెడ్డి ఆలోచనగా ఉంది. దీంతో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందుగానే తన పేషీలోని ఐఏఎస్ అధికారులకు కీలకమైన శాఖలను అప్పగించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది.

ముందుగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మిగతా శాఖల్లో పనిచేసే కేడర్‌కు, ఉద్యోగులకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనే కనీస ఆలోచన ఇటు ముఖ్యమంత్రికిగానీ, ఆ పేషీలో పనిచేసే ఐఏఎస్ అధికారులకుగాని లేకపోవడం గమనార్హం. తన పేషీలోని అధికారులకు ముఖ్యమైన శాఖల్లో బాధ్యతలు అప్పగించడానికి నాలుగైదు శాఖలకు అధికారులను నియమించకుండా నెలల తరబడి ముఖ్యమంత్రే ఖాళీగా ఉంచారా? లేదా పేషీలోని అధికారులే ఆ పనిచేశారా.. అనేది ప్రశ్నార్థకంగా ఉంది.

సాధారణంగా అయితే నెలల తరబడి కీలకమైన శాఖలకు అధికారులు లేకపోతే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆయా ఖాళీలను భర్తీచేసే బాధ్యత సీఎం పేషీలోని ఐఏఎస్‌లపై ఉంటుంది. ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే పేషీలోని అధికారులు విస్మరించారా లేదా సీఎం, అధికారులు కలిసే మిన్నకుండిపోయారా అనే అనుమానాలు వస్తున్నాయి.
 
  ఇదిలా ఉంటే సీఎం, తన పేషీలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు అజయ్ కల్లం, జవహర్‌రెడ్డి, ఎస్.ఎస్.రావత్,  శ్రీధర్‌లను నెలల తరబడి ఖాళీగా ఉన్న కీలక శాఖలకు బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆర్థిక శాఖలో కీలకమైన ముఖ్యకార్యదర్శి పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. అలాగే సాగునీటి శాఖలో ముఖ్యకార్యదర్శి పదవి నెలల తరబడి ఖాళీగా ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పదవి కూడా నెలల తరబడి ఖాళీగా ఉంది.

ఇప్పుడు ఈ ముఖ్యమైన శాఖలకు వీరిని పంపనున్నారని సమాచారం. అలాగే భారీ ఎత్తున ఇతర అధికారులను కూడా బదిలీ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. సీఎం రాజీనామా సంతకానికి ముందుగానే ఈ బదిలీలపై సంతకాలు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. శనివారం వరకు ఫైళ్లన్నింటినీ సీఎం క్యాంపు కార్యాలయానికి తరలించిన పేషీ అధికారులు పనిలో పనిగా తమకు చెందిన వ్యక్తిగత పుస్తకాలు, ఇతర సామాగ్రిని కూడా సర్దుకుని ఇళ్లకు పట్టుకుపోయారని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement