కర్నూలు ఆసుపత్రి చరిత్రలో మరో మైలురాయి 

Kidney Operation Successful In Kurnool General Hospital  - Sakshi

సాక్షి, కర్నూలు : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మరో మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రి చరిత్రలో, రాయలసీమలోనే తొలిసారిగా ఓ రోగికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. కర్నూలు మెడికల్‌ కాలేజీ మొదటి బ్యాచ్‌ విద్యార్థి, ఉస్మానియా ఆసుపత్రి యురాలజీ విభాగం మాజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విక్రమసింహారెడ్డి, నిమ్స్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సూర్యప్రకాష్‌ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సను ఆసుపత్రి యురాలజీ హెచ్‌వోడీ డాక్టర్‌ భగవాన్, ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీతారామయ్య విజయవంతంగా చేశారు. స్వయాన యురాలజిస్ట్‌ అయిన కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ కూడా పాల్గొని సహాయ సహకారాలు అందించడం విశేషం.

వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు (24)కు రెండు కిడ్నీలు పాడైపోయాయి. కిడ్నీ మార్పిడి తప్పనిసరని వైద్యులు చెప్పారు. పెద్దాసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు జీవన్‌దాన్‌ ట్రస్ట్‌ నుంచి ఏడాది క్రితం అనుమతి లభించింది. దీంతో రామాంజనేయులు పేరును రిజిష్టర్‌ చేయించారు. అతనికి కిడ్నీ ఇవ్వడానికి తల్లి బజారమ్మ ముందుకు వచ్చింది. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది కలిపి మొత్తం 35 మందితో కూడిన బృందం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరంతరాయంగా శ్రమించి ఆపరేషన్‌ను విజయవంతం చేశారు.

పెద్దాసుపత్రి చరిత్రలో గొప్ప అధ్యాయం : కలెక్టర్‌ 
పెద్దాసుపత్రి చరిత్రలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఒక గొప్ప అధ్యాయమని, ఆసుపత్రి మరో మైలురాయిని చేరుకుందని జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ప్రశంసించారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్యులను, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ గురించి తెలుసుకుని చాలా గర్వపడ్డానన్నారు. ఇది నిజంగా ఆసుపత్రి చరిత్రలో గొప్ప లక్ష్యసాధనగా పేర్కొన్నారు.

కిడ్నీ మార్పిడి తర్వాత ఒక ఏడాది వరకు అవసరమైన మందులను జిల్లా కలెక్టర్‌ నిధుల నుంచి ఇస్తానని ప్రకటించారు. ఒక్క ఆపరేషన్‌తో ఆపకూడదని, ఇకపై మరిన్ని ఆపరేషన్లు చేయాలని వైద్యులను ప్రోత్సహించారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అన్ని రకాల వైద్యసేవలు అందించగలిగే వైద్యులు  ఇక్కడ ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్, నెఫ్రాలజీ హెచ్‌వోడీ డాక్టర్‌ పీఎన్‌ జిక్కి, యురాలజీ హెచ్‌వోడీ డాక్టర్‌ భగవాన్, ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీతారామయ్య, అనస్తీషియా ప్రొఫెసర్‌ డాక్టర్‌ రఘురామ్, జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు. 

డాక్టర్‌ సూర్యప్రకాష్‌కు సన్మానం 
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయడంలో సహకరించిన నిమ్స్‌ యురాలజీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.సూర్యప్రకాష్‌ను సోమవారం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరగడం కర్నూలుకే గర్వకారణమని క్లబ్‌ జిల్లా చైర్మన్‌ ఎన్‌.వెంకటరామరాజు అన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ మాజీ గవర్నర్‌లు ఎస్‌.నాగేశ్వర్‌రావు, డాక్టర్‌ జి.బాలమద్దయ్య, సభ్యులు రమణగౌడ్, బోస్‌ పాల్గొన్నారు. 

30 ఏళ్ల కల నెరవేరింది 
నేను కర్నూలు మెడికల్‌ కాలేజీ మొదటి బ్యాచ్‌ విద్యార్థిని. మా చేరికతోనే ఈ ఆసుపత్రి జనరల్‌ ఆసుపత్రిగా మారింది. 1971లో నా ఆధ్వర్యంలో ఇక్కడ యురాలజీ విభాగం ప్రారంభమైంది. అప్పట్లో రాయలసీమలోనే నేను మొదటి యురాలజిస్టు. అప్పట్లోనే ఒక రోగికి డయాలసిస్‌  ప్రారంభించాం. 30 ఏళ్ల క్రితమే నేను ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభించాలని భావించా. అయితే ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత  హైదరాబాద్‌ పిలిపించి ఉస్మానియాలో ఉంచారు. 30 ఏళ్ల తర్వాత నా కల నెరవేరింది. నా ఆధ్వర్యంలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరగడం ఆనందంగా ఉంది.  
– డాక్టర్‌ ఎ.విక్రమసింహారెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి రిటైర్డ్‌ ప్రొఫెసర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top