గాడి తప్పిన డీఆర్‌డీఏ | Key posts Empty in DRDA | Sakshi
Sakshi News home page

గాడి తప్పిన డీఆర్‌డీఏ

Jan 5 2015 12:17 AM | Updated on Sep 2 2017 7:13 PM

గాడి తప్పిన డీఆర్‌డీఏ

గాడి తప్పిన డీఆర్‌డీఏ

జిల్లాలోని కీలక ప్రభుత్వ శాఖల్లో ఒకటైన జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్‌డీఏ)లో కీలక పోస్టులు ఖాళీగా

ఏలూరు (టూటౌన్):జిల్లాలోని కీలక ప్రభుత్వ శాఖల్లో ఒకటైన జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్‌డీఏ)లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ శాఖ పనితీరు దిక్కూ మొక్కూ లేని విధంగా తయారైంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్టో శని అన్నట్టు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసే ఈ శాఖలో అజమాయిషీ కరువు అవటంతో కిందిస్థాయి అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి సరైన మార్గ దర్శకత్వం లేక కొన్ని కార్యక్రమాలు గాడి తప్పుతున్నాయి. వివరాల్లోకి వెళితే డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోనూ, దానికి అనుబంధంగా ఉన్న ఇందిరా క్రాంతిపథంలోనూ ఎన్నో పథకాలను నిర్వహిస్తున్నారు. దీనిలో ప్రధానంగా పింఛన్ల పంపిణీ, ఇసుక ర్యాంపుల నిర్వహణ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, డ్వాక్రా గ్రూపుల నిర్వహణ తదితర ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
 అయితే వీటి నిర్వహణ సక్రమంగా జరిగేందుకు జిల్లా స్థాయి పీడీ, ముగ్గురు ఏపీడీలు, ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారి, ఒక అకౌంట్స్ అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆ పోస్టులన్నీ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన అధికారులు సైతం రావడానికి సిద్ధపడటం లేదు. ఆగస్టు నెలలో రెగ్యులర్ పీడీగా విధులు నిర్వర్తించిన పులి శ్రీనివాసులు వ్యక్తిగత సెలవు పెట్టి అప్పటి నుంచి విధులకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో డ్వామా పీడీ ఇన్‌చార్జి పనిచేస్తున్నారు. కాగా ఈ శాఖలో మూడు ఏపీడీ పోస్టులకు గానూ ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. వీరిలో డీఆర్‌డీఏ ఏపీడీ, ఇందిరాక్రాంతిపథం ఏపీడీ పోస్టులు ఎప్పటి నుంచో ఖాళీగా ఉండగా నిన్నటి వరకూ ఉన్న ఏపీడీ లాండ్ అధికారి కెఇ సాధనను క్యాపిటల్ రెవెన్యూ డెవలప్‌మెంట్ అథారిటీకి (సీఆర్‌డీఏ) బదిలీ చేశారు.
 
 అకౌంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎస్.నాగేశ్వరరావు విశాఖపట్నం బదీలీపై వెళ్లిపోవటంతో ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. అడ్మినిస్ట్రేషన్ అధికారి పోస్టులో కూడా కొంతకాలంగా ఎవరినీ నియమించక పోవటంతో ఖాళీగా ఉంది. డీపీఎం ఐబీ, డీపీఎం ఎన్ పీయం, డీపీఎం మార్కెటింగ్ పోస్టులు కూడా ఖాళీగా ఉండటంతో డీఆర్‌డీఏ పనితీరు చుక్కాని లేని నావలా తయారైంది. ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి పూర్తి స్థాయి అధికారులను నియమించి ఆ శాఖకు పూర్వ వైభవం తీసుకురావలసిన అవసరం ఉంది. కాగా డీఆర్‌డీఏ పీడీగా ఎస్.రామచంద్రారెడ్డిని ప్రభుత్వం నియమించి ఐదు రోజులయినా ఇంతవరకూ జాయిన్ కాలేదు. అయితే కావాలని అడిగిన వారిని కాదని వేరే వారిని నియమించటంతో వారు పీడీ బాధ్యతలు స్వీకరించడానికి వెనుకాడుతున్నట్టు సమాచారం.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement