ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయపడి ఆంధ్రా సీఎం, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్లిపోయారని,
అందుకే పుష్కరాలపై శ్రద్ధ కొరవడింది
పర్యవసానమే పెను ప్రమాదం
ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
మలికిపురం : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయపడి ఆంధ్రా సీఎం, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్లిపోయారని, అందుకే పుష్కరాలపై ప్రభుత్వానికి శ్రద్ధ కొరవడిందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మలికిపురంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇస్తుందన్న భయంతోనే వారు విదేశాలకు వెళ్లిపోయారని విమర్శించారు. పుష్కర ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో ప్రమాదం జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, పోలీసులతోపాటు ఇతర శాఖల వైఫల్యం చాలా ఉందన్నారు.
సాధారణ భక్తులు స్నానాలు చేసేచోట ముఖ్యమంత్రి స్నానాలు చేయడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ దుర్ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రూ.1400 కోట్లు వెచ్చించి ఆరు నెలలుగా పనులు చేస్తుంటే ఏర్పాట్లు చేసేది ఇలాగేనా అని ప్రశ్నించారు. రాజమండ్రిలో పుష్కర యాత్రికులు సుమారు ఆరు కిలోమీటర్లు నడిచి ఘాట్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేయడం దారుణమన్నారు. బస్సులను నేరుగా ఘాట్‌ల వద్దకు వచ్చేలా చేసి వెంటనే స్నానాలు ముగించుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటే భక్తులకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు.