
విజయవాడ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ సీఎం చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ధ్వజమెత్తారు. శుక్రవారమిక్కడ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుకు నోటి వెంట అబద్ధాలు మాత్రమే వస్తాయన్నారు. 2014 కాకినాడ ఎన్నికల సభలో అధికారంలోకొస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకొచ్చాక రెండుసార్లు పెంచారన్నారు. దీంతో ప్రజలపై రూ.4,759 కోట్ల పెనుభారం పడిందన్నారు.
అదే సమయంలో మూడోవిడత కూడా విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలిపారు. కనకదుర్గమ్మ సాక్షిగా విద్యుత్ చార్జీలపై అబద్ధాలాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు కుమారుడికి మినహా నిరుద్యోగుల్లో ఎవరికీ ఉద్యోగమివ్వలేదని విమర్శించారు. చంద్రబాబును గ్రామాల్లోకి వెళితే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని అన్నారు.
సీఎంకు పర్యటనలే ముఖ్యం..: ఒకవైపు ఆసుపత్రుల్లో వందలాది మంది ప్రజలు విషజ్వరాలు, డెంగీతో అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు, మంత్రులు దసరా సంబరాల్లో మునిగితేలుతున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు. ఎప్పుడు అమెరికా వెళదామా.. లేకపోతే సొంతబృందంతో జపాన్, సింగ్‌పూర్, ఇటలీ టూర్ పెట్టుకుందామా అని ఆలోచించడం మినహా చంద్రబాబుకు మరొకటి ఉండదన్నారు. మూడున్నరేళ్లపాటు రాజధాని నిర్మాణంపై బొమ్మలు చూపించి మోసం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు కొత్తగా సినీ దర్శకుడు రాజమౌళిని రాజధాని డిజైన్లకు రూపకల్పన చేయమనడం విడ్డూరమన్నారు.
ప్రతిదానికీ అడ్డుపడుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్షంపై చేతగాని మాటలు మాట్లాడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కోట్లాది రూపాయలు దండుకుని నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్నవర్షానికే కారిపోతుంటే ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టినప్పుడు దుర్మార్గంగా పక్కరాష్ట్రాల సీఎంల కాళ్లు పట్టుకుని కోర్టుల్లో కేసులు వేయించింది నీవు కాదా చంద్రబాబూ? అని ప్రశ్నించారు.