ఉద్యోగ భర్తీ గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లకు పెంపు

Job replacement maximum age limit is 42 years - Sakshi

వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు వర్తించేలా జీవో

యూనిఫాం పోస్టుల వయోపరిమితికి వర్తించని జీవో

ఆ పోస్టుల వయోపరిమితిని రెండేళ్లు పెంచాలంటూ లేఖలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు సాధారణ పరిపాలనా శాఖ సోమవారం జీవో 132ను విడుదల చేసింది. ఈ వయోపరిమితి పెంపు కాలపరిమితి 2019 సెప్టెంబర్‌ 30 వరకు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో వివరించింది. గతంలో ఇచ్చిన జీవో కాలపరిమితి గతనెల 30వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత వయోపరిమితి పెంపు జీవో విడుదల కాకపోవడంతో ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల సందిగ్ధంలో పడింది. వయోపరిమితి పెంచకుంటే పాత నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు మాత్రమే ఉంటుంది. దీనివల్ల లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోనున్నారు. ప్రభుత్వం 2016లో మాత్రమే ఏపీపీఎస్సీ ద్వారా 4,275 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయించింది. పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డు ద్వారా మరో 5 వేలకుపైగా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆ తరువాత నుంచి నోటిఫికేషన్లు లేవు.

ఈలోగా వయోపరిమితి పెంపునకు సంబంధించిన జీవో కాలపరిమితి ముగిసిపోవడంతో రెండుసార్లు జీవోలు విడుదల చేసి ఏడాది చొప్పున పెంచినా కొత్తగా నోటిఫికేషన్లు మాత్రం విడుదల చేయలేదు. దాదాపు 5 లక్షల మంది వరకు నిరుద్యోగులు వయోపరిమితిని దాటిపోయి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాగా, ఇటీవల వివిధ శాఖల్లో 18,450 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలంటే ముందుగా వయోపరిమితి విషయంలో ప్రభుత్వం స్పష్టతనిస్తూ కొత్తగా జీవో జారీచేయాల్సి ఉండడంతో ఏపీపీఎస్సీ సహా అన్ని నోటిఫికేషన్లు నిలిచిపోయాయి. ఇప్పుడు వయోపరిమితి పెంపు జీవో కాలపరిమితి మరో ఏడాది పెంచుతూ ఉత్తర్వులు వెలువడడంతో నిరుద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉత్తర్వులతో ప్రస్తుతమున్న 34 ఏళ్ల వయోపరిమితి 42 ఏళ్లకు పెరుగుతుంది. అయితే ఈ పెంపు కేవలం నాన్‌ యూనిఫాం కేడర్‌ పోస్టులకు మాత్రమే వర్తిస్తుంది. యూనిఫారం పోస్టులు అంటే పోలీసు, ఎక్సైజ్, ఫైర్, ఫారెస్టు శాఖల్లోని కొన్ని కేటగిరీల పోస్టులకు ఇది వర్తించదు.

యూనిఫాం పోస్టులకు రెండేళ్ల పెంపునకు లేఖలు
ఇలా ఉండగా గతంలో యూనిఫాం విభాగాలైన పోలీసు, ఎక్సైజ్, ఫారెస్టు, ఫైర్‌ శాఖల్లోని పోస్టులకు ఆయా కేటగిరీలను అనుసరించి నిర్ణీత వయోపరిమితికి అదనంగా మరో రెండేళ్లు ప్రభుత్వం పెంచింది. ఈ యూనిఫాం పోస్టులు శరీరదారుఢ్యానికి సంబంధించినవి కావడంతో నిర్ణీత వయోపరిమితికి రెండేళ్లు మాత్రమే పొడిగింపు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల కాలపరిమితి 2017 సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. ప్రస్తుతం యూనిఫాం పోస్టులు భర్తీకి కూడా ఆర్థిక శాఖ అనుమతులిచ్చిన నేపథ్యంలో ఆయా పోస్టుల వయోపరిమితిని కూడా పెంచాల్సి ఉంటుంది. ఈమేరకు ఆయా శాఖలు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top