
సాక్షి, అమరావతి : గ్రూప్–1 మెయిన్స్ తిరిగి నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ)తో పాటు మరికొందరు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తూ జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలనుకుంటే సమరి్పంచవచ్చని స్పష్టం చేసింది.
మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష మొత్తాన్ని, అర్హత సాధించినవారి జాబితాను కూడా రద్దు చేశారు. తిరిగి మెయిన్స్ నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను ఆర్నెల్లలో పూర్తి చేయాలని ఏపీపీఎస్‌సీ అధికారులను ఆదేశించారు. దీనిని సవాల్ చేస్తూ ఏపీపీఎస్‌సీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.
ఉద్యోగాలు పొంది ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్నవారు కూడా అప్పీళ్లు వేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ధర్మాసనం రెండు రోజులు సుదీర్ఘ విచారణ జరిపింది. ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు కేఎస్ మూర్తి, రవిశంకర్, న్యాయవాదులు జొన్నగడ్డ సు«దీర్, షేక్ సలీమ్ తదితరులు శుక్రవారం వాదనలు వినిపించారు. హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్నారు.
హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరగలేదు
ఏపీపీఎస్‌సీ తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరగలేదన్నారు. అందువల్ల మూల్యాంకనానికి సంబంధించిన సీసీ ఫుటేజీ లేదని తెలిపారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తరఫు సీనియర్ న్యాయవాదులు చింతల విష్ణుమోహన్‌రెడ్డి, ఓబిరెడ్డి మనోహర్‌రెడ్డి, పమిడిఘంటం శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ, హాయ్‌ల్యాండ్‌లో ఎలాంటి మూల్యాంకనం జరగలేదని పునరుద్ఘాటించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.