సమైక్యాంధ్ర ఉద్యమంలో ధైర్యమున్న నాయకుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అన్నారు
ఆళ్లగడ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో ధైర్యమున్న నాయకుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అన్నారు. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో సమైక్యాంధ్ర కోసం 48 గంటల దీక్ష చేపట్టిన ఆమెకు రెండో రోజు గురువారం సంఘీభావం తెలిపేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జగన్ జైలుల్లోనే ఉంటూ పోరాడారన్నారు. ఆమరణ దీక్ష చేస్తే ములాఖత్‌లు రద్దు చేస్తారని, తీహార్ జైలుకు పంపుతారని అనుమానం ఉన్నా భయపడలేదన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడానికి ముందుకు రాని సమయంలో మొట్టమొదటి రాజీనామా చేసిన నేత జగనేన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేత రాజీనామాలు చేయించారన్నారు. నోట్ రాక ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్, టీడీపీలు ముందుకు రాకపోవడంతోనే పార్టీల నైజం బయటపడిందన్నారు. ఉత్తుత్తి ఉద్యమాలు చేస్తున్న పార్టీల నాయకులను తరిమికొట్టాలని ప్రజలను కోరారు. శోభకు సంఘీభావంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, ఎస్వీ నాగిరెడ్డి దీక్షా శిబిరంలో కూర్చున్నారు.