జనం దాహం అంటున్నా.. దయలేని ప్రభుత్వం | It is a way to thirst .. heartless government | Sakshi
Sakshi News home page

జనం దాహం అంటున్నా.. దయలేని ప్రభుత్వం

Feb 6 2015 1:32 AM | Updated on Mar 19 2019 6:19 PM

జనం దాహం అంటున్నా.. దయలేని ప్రభుత్వం - Sakshi

జనం దాహం అంటున్నా.. దయలేని ప్రభుత్వం

జిల్లా వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి అయినా విడుదల చేయలేదని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.

చిన్నమండెం(రాయచోటి):   జిల్లా వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి అయినా విడుదల చేయలేదని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం తన కార్యాలయానికి పలు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా, ఎమ్మెల్యే ఈ విధంగా స్పందించారు. నిర్మాణాలు జరుపుకొంటున్న పలు ప్రాజెక్టులు కూడా గత ప్రభుత్వంలో విడుదలైన నిధులతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 9 నెలల కాలంలో ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని, దీంతో ప్రజలు  నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. రాయచోటి పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో తాగునీటి కోసం నిరాహారదీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయూలన్న దయ కలగడంలేదని విమర్శించారు.
 
 రెండేళ్ల పాటు గ్రామాలకు నీటి సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రోళ్లమడుగు, వెలిగల్లు జలాశయాల నుంచి త్వరలోనే లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు మండలాలకు తాగునీరు అందించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వం తమదే అంటూ ప్రగల్భాలు పలుకుతున్న పలువురు నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం, తాగునీటి ఎద్దడి తీర్చడానికి కృషి చేయాలని కోరారు.
 
  గతంలో నాలుగేళ్లు అధికారంలో ఉన్న పార్టీలో కొనసాగి, ఇప్పుడు పార్టీ మారి అధికారం తమదే అంటున్న నాయకులు ఒక్కటంటే ఒక్క గ్రామానికి కూడా చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాయచోటి ప్రాంతంలో అన్ని మండలాలకు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం పోరాడేందుకు, ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేందుకు కలిసి రావాలని ఆయన కోరారు. ఇప్పటికే అవసరమైన నిధులపై ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. దీంతోపాటు ఎమ్మెల్యే, ఎంపీ నిధులను మొత్తం కేటాయిస్తామన్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాగునీటి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement