సీఎం జగన్‌ అధ్యక్షతన ‘మన పాలన- మీ సూచన’

Intellectual Conference Started By CM YS Jagan In Tadepalli - Sakshi

ఏడాది పాలనపై నేటి నుంచి 6 రోజులపాటు మేథోమధనం

గ్రామ సచివాలయాలు, సంక్షేమం, పరిపాలన అంశాలపై చర్చ

లబ్ధిదారులు, నిపుణులతో క్యాంప్ కార్యాలయంలో చర్చ

సాక్షి, అమరావతి : వ్యవస్థలో మార్పు తీసుకువస్తేనే తప్ప, ప్రజలను మనం ఆదుకోలేమనే భావన కలిగిందని, సుపరిపాలన అందించేందుకు ఒక​ వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ వ్యవస్థే.. గ్రామ సచివాలయ వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని సీఎం జగన్‌ ప్రశంసించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల వ్యవస్థ ద్వారా  వైరస్‌ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సు సోమవారం  ప్రారంభమైంది.

నేరుగా మీ ఇంటి వద్దకే సేవలు
ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘14 నెలలపాటు నా పాదయాత్ర 3,648 కిలోమీటర్లు సాగింది. పాదయాత్రలో ప్రజల కష్టాలు గమనించా. ప్రభుత్వం ఏర్పడ్డాక సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. ఆ వ్యవస్థే.. గ్రామ సచివాలయ వ్యవస్థ. ప్రతి లబ్దిదారుడికి న్యాయం జరిగేలా చూస్తున్నాం.లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో ఉంచుతున్నాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా ఇంటివద్దకే సేవలు అందేలా చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు వాలంటీర్ల వ్యవస్థలో 82 శాతం అవకాశం కల్పించాం. 

ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అవినీతి లేని పారదర్శకత ఉన్న వ్యవస్థ.. గ్రామ సచివాలయ వ్యవస్థ. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. గ్రామ సచివాలయాలతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవ్వాతాతలకు నేరుగా ఇంటివద్దకే పెన్షన్ అందిస్తున్నాం. మత్స్యకార భరోసా, వాహనమిత్ర, వైఎస్ఆర్ భీమా పథకాలు తీసుకొచ్చాం. వాలంటీర్లు, ఆశావర్కర్ల వ్యవస్థ ద్వారానే కరోనాను నియంత్రణ చర్యలు చేపట్టాం. మూడుసార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించాం.’ అని తెలిపారు.

24 గంటలపాటు గ్రామాల్లో వైద్య సేవలు
రాష్ట్రంలో 43 వేల బెల్టుషాపులను తొలగించామని, మద్యం అమ్మకాల్లో ప్రైవేట్ వ్యక్తులను కూడా తొలగించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. షాక్ కొట్టే విధంగా మద్యం ధరలు పెంచడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయన్నారు. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని, ప్రతి గ్రామంలో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే వైఎస్సార్‌ విలేజ్ క్లినిక్‌లను ప్రారంభిస్తామన్నారు. 24 గంటలపాటు గ్రామాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో వ్యవసాయ నిపుణుల ద్వారా సలహాలు, సూచనలు అందిస్తామని వెల్లడించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, త్వరలో గ్రామాల్లో జనతా బజారు తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

18 దిశ పీఎస్‌లను ఏర్పాటు
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం మేనిఫెస్టోను పూర్తి చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. జులై 8, 2019 వైఎస్సార్‌ పెన్షన్ కానుక ప్రారంభించాం. గత ప్రభుత్వం 44 లక్షల పెన్షన్లు ఇస్తే..ప్రస్తుతం 58 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గత సర్కార్ రూ.1000 పెన్షన్ ఇస్తే.. ఈ ప్రభుత్వం రూ.2,250 పెన్షన్ ఇస్తోంది. 69 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.1,110 కోట్ల సబ్సిడీ అందించాం. అన్ని పథకాలను గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే చేరుస్తున్నాం. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చాం. 18 దిశ పీఎస్‌లను ఏర్పాటు చేశాం. 81 వేల మంది చేనేతలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. 82 లక్షల మంది పిల్లలకు చేయూతగా 43 లక్షల మంది తల్లుల అకౌంట్‌లో అమ్మఒడి విద్యాదీవెన కింద రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాం. అని పేర్కొన్నారు.

జులై 8 దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా 28 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. రేపు అర్చకులు, పాస్టర్లు, మౌజమ్‌లకు రూ.5వేల చొప్పున సాయం చేస్తామన్నారు.
► మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
►జూన్ 4న వైఎస్ఆర్ వాహన మిత్ర 
►జూన్ 10న షాపు ఉన్న నాయిబ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు రూ.10వేలు
►జూన్‌ 17న మగ్గమున్న చేనేత కుటుంబాలకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం
►జూన్‌ 24న వైఎస్ఆర్ కాపు నేస్తం: సీఎం జగన్
►జూన్ 29న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి ..
►రెండో విడత రూ.450 కోట్లు విడుదల
►జులై 1న 1060 కొత్త 104, 108 అంబులెన్స్‌లు ప్రారంభం
►జులై 8న వైఎస్ఆర్ పుట్టిన రోజు సందర్భంగా 27 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ
►జులై 29న రైతులకు వడ్డీలేని రుణాలు
►ఆగస్టు 3న వైఎస్ఆర్ విద్యా కానుక
►ఆగస్ట్ 9న ఆదివాసీ దినోత్సవం రోజు గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీ
►ఆగస్ట్ 12న వైఎస్ఆర్ చేయూత: సీఎం జగన్
►ఆగస్ట్ 19న వైఎస్ఆర్ వసతి దీవెన: సీఎం జగన్
►ఆగస్ట్ 26న హౌసింగ్ నిర్మాణం
►15 లక్షల వైఎస్ఆర్ హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
►సెప్టెంబర్‌ 11న వైఎస్ఆర్ ఆసరా
►సెప్టెంబర్‌ 25 వైఎస్ఆర్ విద్యా దీవెన ప్రారంభం
►అక్టోబర్‌లో రెండో విడత రైతు భరోసా, ప్రతి రైతు కుటుంబానికి రూ.4 వేలు
►అక్టోబర్‌లో గుర్తింపు కార్డు ఉన్న చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల రుణం
►నవంబర్‌లో విద్యా దీవెన రెండో దఫా ఫీజులు నేరుగా తల్లుల అకౌంట్‌కు 
►డిసెంబర్‌లో అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం
►2021, జనవరిలో రెండో విడత అమ్మ ఒడి
►2021 జనవరిలోనే చివరి విడత రైతు భరోసా, రూ.2వేలు
►2021 ఫిబ్రవరి విద్యా దీవెన మూడో త్రైమాసం, రెండో దఫా వసతి దీవెన
►2021 మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top