భవానీ దీక్షల విరమణ | Initiation and cessation of Bhavani | Sakshi
Sakshi News home page

భవానీ దీక్షల విరమణ

Dec 24 2013 12:14 AM | Updated on Sep 2 2017 1:53 AM

భవానీ దీక్షల విరమణ

భవానీ దీక్షల విరమణ

దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో సోమవారం నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సుమారు 20 వేల మంది...

=తొలిరోజు 20 వేల మంది
 =1.20 లక్షల లడ్డూల విక్రయం

 
విజయవాడ, న్యూస్‌లైన్ : దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో సోమవారం నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సుమారు 20 వేల మంది భవానీలు దీక్షలు విరమించారని ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారి మూలవిరాట్‌కు, భవానీదీక్ష మండపంలోని అమ్మవారి ఉత్సవమూర్తికి ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. మూడు గంటల నుంచి అమ్మవారి మూలవిరాట్‌కు విశేష పూజలు, అలంకరణ అనంతరం ఆరు గంటల నుంచి భవానీలను దర్శనానికి అనుమతించారు.

ఆలయ ప్రాంగణం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరిన ఆలయ ఇన్‌చార్జి ఈవో త్రినాథరావు, అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు మహా మండపం ఏర్పాటుచేసిన హోమగుండాలలో అగ్నిప్రతిష్టాపన చేశారు. అగ్ని ప్రతిష్టాపనను పురస్కరించుకుని ఆలయ ఇన్‌చార్జి ఈవో త్రినాథ్‌రావు, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, డీసీపీ రవిప్రకాష్ ప్రత్యేక పూజలు చేశారు. దీంతో భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి.

తెల్లవారుజామున భవానీల రద్దీ...

ఆదివారం రాత్రే నగరానికి చేరుకున్న భవానీలు తెల్లవారుజామున కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గిరిప్రదక్షిణ చేశారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌లో వేచి ఉన్న భవానీలతో క్యూలైన్లు కిటకిటలాడాయి. భవానీలు రెండు మార్గాల ద్వారా మహామండపం దిగువకు చేరుకుని దీక్షలు విరమించారు. ఇరుముడిలోని పూజాసామగ్రిని జై భవానీ...జైజై భవానీ అంటూ హోమ గుండాలకు సమర్పించారు. తొలిరోజు సుమారు 1.20 లక్షల లడ్డూలను విక్రయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం రద్దీ తగ్గుముఖం పట్టడంతో లడ్డూ ప్రసాదాల విక్రయాలు కాస్త తగ్గినట్లు వారు పేర్కొన్నారు.  దేవస్థానం వద్ద నాలుగు లక్షలకు పైగా లడ్డూలను తయారు చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
 
7 వేల మందికి అన్నదానం
 
దీక్ష విరమణలను పురస్కరించుకుని తొలి రోజున ఏడువేల మంది భవానీలకు అన్నదానం చేశారు. అర్జున వీధిలోని శృంగేరీ పీఠంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు అన్నదానం జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. దీక్ష విరమణ చేసే భవానీల మెడలోని మాలలు, ఇరుముడులను విప్పేందుకు మూడు విడతలుగా విధులు నిర్వహించేందుకు  రెండు వందల మంది రుత్వికులను దేవస్థానం  నియమించింది. వీరితో పాటు ఆలయ అర్చకులు, పరిచారకులు విధులను నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement