నిధులు ఫిట్‌.. విధులు సూపర్‌ హిట్‌ 

Infrastructure In Tribal Areas - Sakshi

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో సీసీ రోడ్లు, భవనాల నిర్మాణం

గిరిజన ప్రాంతాల్లో మరింత ప్రగతి

ఈ ఏడాది మెటీరియల్‌ పనులకు రూ. 296 కోట్లు కేటాయింపు  

శ్రీకాకుళం పాత బస్టాండ్‌: జిల్లాలోని గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగవుతున్నాయి. అభివృద్ధి పనులు కూడా వేగం పుంజుకున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామాల పాలిట వరదాయినిగా మారింది. రెండేళ్లుగా జిల్లాలో ఉపాధి హామీ పనులు విస్తారంగా జరగడంతో వేతనదారుల సంఖ్య పెరిగింది. దీంతో పాటుగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ నగదు కూడా పెరుగుతూ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో వేతన నగదు రూ. 480 కోట్లు చెల్లించగా, జిల్లాలో 5,50,000 మంది వేతన దారులకు పని దినాలు కల్పించారు. జిల్లా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 2,42,00,000 పని దినాలు కల్పించారు. మెటీరియల్‌ కాంపోనెంటు నిధులు రూ.296 కోట్లు సాధించారు. ఈ ఏడాది ఇప్పటికే జిల్లాలో ఉపాధి పనుల్లో చాలా వరకు లక్ష్యాలు సాధించారు. ఇప్పటికే రూ.480.05 కోట్లకు చేరారు.

అలాగే మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు రూ.296.77 కోట్లకి చేరాయి. ఈ ఏడాది గ్రామాల్లో పనులు చేసేందుకు ఈ కాంపోనెంట్‌ నిధులు కేటాయించారు. ఈ డబ్బుతోనే అన్ని శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు ఉన్నందున మరిన్ని పనులు జరిగే అవకాశం ఉందని జిల్లా నీటి  యాజమాన్య సంస్థ అధికారులు చెబుతున్నారు.  

ముమ్మరంగా పనులు.. 
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చిన మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో సీసీ రోడ్లు (487 కిలోమీటర్లు) వేసేందుకు పనులు జరుగుతున్నాయి. అంగన్‌వాడీ భవన నిర్మాణానికి 272 భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు 21, సచివాలయ భవనాలు 812, మండల మహిళా సమాఖ్యకు 3 భవనాలు, బీటీ రోడ్లు 130.24 కిలోమీటర్ల వరకు.. ఇలా మొత్తం రూ. 451.87కోట్లు ఖర్చు చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఒక్కో నియోజకవర్గానికి రూ.11.5 కోట్లు మంజూరు చేశారు. సర్వశిక్ష అభియాన్‌లో వివిధ పాఠశాలలకు ప్రహరీలు నిర్మించేందుకు రూ.30 కోట్లు కేటాయించారు. పశు సంవర్ధక శాఖలో 4025 మినీ గోకులాలు, గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి 7475 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గిరిజన సంక్షేమం పరిధిలో 39 కాంపౌండ్‌ వాల్స్, 29 రోడ్లు (అన్‌ కనెక్టెడ్‌ హేబిటేషన్‌ రోడ్లు), 26 డబ్ల్యూఎంబీ రోడ్లకు నిధులు కేటాయించారు.  

మూడు నెలల గడువు ఉంది 
ఇప్పటికే గత ఏడాది కంటే వేతనదారుల పనులు, మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధుల సమీకరణ ఎక్కువగా సాధించాం. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి గడువు మూడు నెలలు ఉంది. ఈ ఏడాది వేతనదారులు మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు రూ.వెయ్యి కోట్లు సాధించే దిశ గా పనులు చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది, అనుబంధ శాఖల సమన్వయంతో మ రింత ప్రగతి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తు న్నాం. గత ఏడాది పనులకు గాను జాతీయ అవార్డు రావడంతో ఈ శాఖ, ఇతర అనుబంధ శాఖల ఉద్యోగుల్లో మరింత ఉత్సాహం, నమ్మకం వచ్చింది.  
– హెచ్‌.కూర్మారావు, పీడీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ, శ్రీకాకుళం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top