వడ్డన అ‘ధనం’ | Increment charges to tribal jathara | Sakshi
Sakshi News home page

వడ్డన అ‘ధనం’

Jan 10 2014 1:55 AM | Updated on Sep 2 2017 2:26 AM

సంక్రాంతి పండుగ, సమ్మక్క-సారలమ్మ జాతర జిల్లా ప్రజలపై ప్రయాణ భారాన్ని మోపనున్నాయి.

 సాక్షి, మంచిర్యాల : సంక్రాంతి పండుగ, సమ్మక్క-సారలమ్మ జాతర జిల్లా ప్రజలపై ప్రయాణ భారాన్ని మోపనున్నాయి. సంక్రాంతి పండుగకు జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు మాత్రమే అదనపు బస్సులు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ.. తూర్పు జిల్లావాసులను రైళ్లను ఆశ్రయించాలని పరోక్షంగా సూచిం చింది. మరోపక్క సమ్మక్క-సారలమ్మ జాతరకు జిల్లాలోని అన్ని డిపోల  నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్న అధికారులు ఆదిలాబాద్ డిపో బస్సులు కరీంనగర్ జిల్లా కాటారంకు పంపి.. అక్కడి నుంచి మన జిల్లాకు ప్రయాణికులను తరలించాలని నిర్ణయించింది. పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా గత జాతరకు తీసుకున్న చార్జీలకు ఈ సారి 10 శాతం నుంచి 15 శాతం పెంచింది. దీంతో జిల్లా ప్రజలపై ప్రయాణ భారం పడనుంది. మరోపక్క వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధికి వెళ్లిన తర్వాతే మేడారం జాతరకు వెళ్లాలనేది ఆనవాయితీ. వేములవాడకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

 జాతర భారం
 2012లో మేడారం జాతరకు జిల్లా నుంచి 330 బస్సులు నడిపిన ఆర్టీసీ ఈసారి అదనంగా 45 బస్సులు పెంచింది. వచ్చే నెల 9 నుంచి 15 తేదీ వరకు బస్సులు నడపనుంది. 2012లో నిర్వహించిన జాతరలో ఆర్టీసీ రూ.కోటిపైనే ఆదాయాన్ని ఆర్జించింది. ఈసారి డీజిల్ ధరలు పెరగడంతో ప్రయాణికులపై చార్జీల భారం మోపింది. మంచిర్యాల నుంచి మేడారంకు పెద్దలకు రూ.240, పిల్లలకు రూ.120, బెల్లంపల్లి నుంచి రూ.230, రూ.101, చెన్నూరు నుంచి రూ.270, రూ.135 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెండేళ్లకోసారి జరిగే గిరిజన జాతరకు జిల్లా నలుమూలలతోపాటు మహారాష్ట్ర నుంచి 10 లక్షలకు పైగా మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

 జిల్లా పరిధిలోని మంచిర్యాల, జైపూర్, రామకృష్ణాపూర్, చెన్నూర్‌లలో మినీ మేడారం జాతర  ఏర్పాటు చేసి వసతులు కల్పిస్తారు. భక్తుల్లో సుమారు 4 లక్షల మంది మేడారంకు తరలివెళ్తారు. మిగిలిన వారు జిల్లాలో ఏర్పాటు చేసిన సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. పెరిగిన చార్జీలతో మేడారం వెళ్లే జిల్లా ప్రయాణికులపై సగటున రూ.20 చొప్పున(చిన్నపిల్లలు, పెద్దలు) దాదాపు రూ.80 లక్షల భారం పడనుంది.

 తూర్పున రైళ్లే దిక్కు
 సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు మాత్రమే బస్సులు నడపాలని నిర్ణయిం చింది. దీంతో రాష్ట్ర రాజధాని వెళ్లే పశ్చిమ ప్రాంతవాసులకు వెసులుబాటు కలిగింది. తూర్పు ప్రాంతంలో రైల్వేమార్గం ఉన్నందున ఎక్కువ మంది రైళ్ల ద్వారే ప్రయాణం సాగిస్తారని ఆర్టీసీ భావిస్తోంది. కొంత వరకు ఇది వాస్తవమే అయినా.. ప్ర స్తుతం పండుగ సీజన్‌లో దాదాపు చాలా మంది రైళ్లనే ఆశ్రయిస్తారు. మాలధారణ చేసిన అయ్యప్పస్వాముల రద్దీ రైళ్లలో అధికంగా ఉండడంతో చాలా మంది ఆర్టీసీ ప్రయాణాన్నే ఎంచుకుంటున్నారు.

 ప్రస్తుతం ైరె ళ్ల సమయపాలన లోపించడం.. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇబ్బందుల్లేని ప్రయాణం కోసం తూర్పు ప్రాంతవాసులు ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మందమర్రి, మంచిర్యాల నుంచి నిర్మల్, కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, వేములవాడ ప్రాంతాలకు రైలు మార్గం లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది.

 డిమాండ్ ఉంటే నడుపుతాం..
 సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు 130 బస్సులు అదనంగా నడుపుతున్నాం. 8, 9,12 వ తేదీల్లో 10 బస్సుల చొప్పున, 10,11 తేదీల్లో 40 బస్సుల చొప్పున బస్సులు నడుపుతున్నాం. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. సమ్మక్క, సారలమ్మ జాతరకు సంబంధించి డీజిల్ ధరలు పెరగడంతో గత జాతర సమయంలో వసూలు చేసిన చార్జీలపై 10 శాతం నుంచి 15 శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నాం. రవాణా పరంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం.- వెంకటేశ్వర్లు, ఆర్‌ఎం, ఆర్టీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement