మోగిన బొబ్బిలి వీణ! | Sakshi
Sakshi News home page

మోగిన బొబ్బిలి వీణ!

Published Fri, Aug 17 2018 12:06 PM

Increased Prices Of Bobbili Veena - Sakshi

బొబ్బిలి విజయనగరం : అంతర్జాతీయంగా పేరు గాంచిన బొబ్బిలి వీణల ధరలు పెరిగాయి. ఈ నెల నుంచే పెరిగిన ధరలు అమలు చేయాలని హస్త కళల అభివృద్ధి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ హస్త కళల అభివృద్ధి సంస్థ కార్యాలయం ద్వారా బొబ్బిలి వీణల కేంద్రం ఇన్‌చార్జికి ఉత్తర్వులు అందాయి. పెరిగిన ధరలు తక్షణం అమలు లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బొబ్బిలిలో కొన్నేళ్లుగా వీణల తయారీ కేంద్రం ఉంది.

ఇక్కడ సుమారు 20 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కేంద్రంలో ప్రొఫెషనల్‌ వీణలతో పాటు గిఫ్ట్‌ వీణలు తయారు చేస్తారు. ఇక్కడి నుంచి గిఫ్ట్‌ వీణలు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అమెరికా వరకూ ఆర్డర్‌పై సప్లై చేస్తుంటారు. బొబ్బిలి వీణల బహుమతి అంటే దానిని స్టేటస్‌గా భావిస్తారు.

తంజావూరు కంటే మిన్నగా..

తమిళనాడులోని తంజావూరులో వీణలు తయారయినా ఇక్కడి ఆకృతులు అందరినీ ఆకర్షించేలా ఉంటాయి. కార్మికుల పనితనం, వివిధ రకాల ఆకృతులతో రూపొందించిన ఇక్కడి గిఫ్ట్‌ వీణలు అమెరికా మాజీ అద్యక్షుడు బిల్‌ క్లింటన్‌ తదితరుల మనసుల్ని సైతం దోచాయి. అధికారికంగా కూడా ఈ రాష్ట్రానికి వచ్చే అతిథులకు బొబ్బిలి వీణలు అందజేయడం ఓ ఆనవాయితీలా మారింది. ప్రస్తుతం ఈ వీణల ధరలు రూ.900 నుంచి రూ.4వేల వరకూ లభిస్తున్నాయి. ఏటా పలు రకాల వీణలను ఇక్కడి నుంచి ఆర్డరుపై లేపాక్షి, హస్తకళల అభివృద్ధి కేంద్రం నిర్వహించే స్టాళ్లకు ఆర్డర్‌పై విక్రయిస్తుంటారు. 

కార్మికులసౌకర్యార్థం..

గతంలో ఇక్కడి కార్మికులు తయారు చేసే వీణలను చూసి నేరుగా వారి వద్దే సందర్శకులు కొనుగోలు చేసే అవకాశం ఉండేది. అయితే కార్మికులు తయారు చేసిన వీణలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారిపై ఆధారపడి ఉండేది. కొందరి ఉత్పత్తులు పూర్తిగా అమ్ముడైతే కొందరు వేచి చూడాల్సి వచ్చేది. కొన్ని రోజుల పాటు కొనుగోలు చేయక కార్మికులకు చేతికి సొమ్మందేది కాదు.

ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం హస్త కళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటిని నేరుగా కొనుగోలు చేసి ఏ రోజుకారోజు కార్మికులకు చెల్లించేలా హాండీ క్రాఫ్టŠస్‌ సంస్థ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ అచ్యుత నారాయణను ఇన్‌చార్జిగా నియమించింది. దీనివల్ల వీణల కేంద్రంలో ఇప్పుడు ఉత్పత్తి దారులకు వెంటనే చేతికి సొమ్మందుతోంది.

ప్రకటించిన ధరల 15 శాతం అదనం

ప్రస్తుతం హస్తకళల సంస్థ ప్రతిపాదించిన ధరలపై 15శాతం అదనంగా తయారీ ఖర్చులుంటాయి. ధరలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఏపీహెచ్‌డీసీఎల్‌ వైస్‌చైర్మన్, ఎండీలనుంచి వెలువడ్డాయి. ఈ నెల 6న విడుదలైన కొత్త ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి.

– అచ్యుతనారాయణ, ఇన్‌చార్జి  

Advertisement

తప్పక చదవండి

Advertisement