యాప్‌ల దునియా.. మేడిన్‌ ఇండియా

Increased popularity of domestic Apps with the ban on China Apps - Sakshi

మొబైల్‌ యూజర్లలో ఉప్పొంగుతున్న దేశభక్తి

చైనా యాప్‌ల నిషేధంతో స్వదేశీ యాప్‌లకు పెరిగిన ఆదరణ

కోటి డౌన్‌ లోడ్స్‌ మైలురాయి దాటిన చింగారి, ట్రెల్, మోజ్‌

50 లక్షలకు పైగా డౌన్‌లోడ్స్‌తో ‘జోష్‌’ 

సాక్షి, అమరావతి: మొబైల్‌ ఫోన్‌ యూజర్లలో దేశభక్తి ఉప్పొంగుతోంది. స్వదేశీ యాప్‌లకు విశేష ఆదరణ లభిస్తోంది. గల్వాన్‌లో భారత సైన్యంపై చైనా దాడి అనంతరం దేశ రక్షణ దృష్ట్యా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. యువతను, పెద్దలను ఉర్రూతలూగించిన చైనా యాప్‌ టిక్‌టాక్‌తోపాటు మరో 58 యాప్‌లను నిషేధించడంతో ప్రత్యామ్నాయ యాప్‌ల కోసం అన్వేషణ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా స్వదేశీ యాప్‌లను గుర్తించి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న యూజర్ల సంఖ్య ప్రతిరోజూ గణనీయంగా పెరుగుతోంది. 

అంతా మేడిన్‌ ఇండియా.. 
► టిక్‌టాక్, ఉయ్‌ చాట్, హెల్లో వంటి చైనా మొబైల్‌ అప్లికేషన్లకు ప్రత్యామ్నాయంగా మన దేశానికి చెందిన చింగారి, ట్రెల్, మోజ్, జోష్‌ వంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 
► స్వదేశీ యాప్‌లకు మేడిన్‌ ఇండియా అనే ట్యాగ్‌లైన్‌ ఉండటంతో వాటిని గుర్తించడం సులభంగా ఉంటోంది.  
► ‘చింగారి మేడిన్‌ ఇండియా’ యాప్‌లో వీడియో, ఆడియో, షేరింగ్‌ వంటి ఆప్షన్లు ఉండటంతో ప్రజాదరణ పొందుతోంది.  
► బెంగళూరుకు చెందిన బిస్వాత్మా నాయక్, మిస్టర్‌ సిద్ధార్థ్‌ గౌతమ్‌ అనే ప్రోగ్రామర్లు ఈ స్వదేశీ యాప్‌ను అభివృద్ధి చేశారు.  
► టిక్‌టాక్‌ ఉన్న రోజుల్లో పాత చింగారి యాప్‌నకు పెద్దగా ఆదరణ లభించలేదు.  
► వీడియో బ్లర్‌ అవుతోందని, సరిగా షేర్‌ కావడం లేదనే సాంకేతిక సమస్యలను యూజర్లు ఏకరువు పెట్టేవారు.  
► ఇప్పుడు సాంకేతిక సమస్యలు అధిగమించడంతో చింగారి యాప్‌నకు క్రేజ్‌ పెరిగింది. 
► వీడియో, ఆడియో, ఫొటో వంటి వాటితో షేరింగ్‌ ఆప్షన్లు గల స్వదేశీ యాప్‌లు ఇప్పుడు మన దేశంలో సత్తా చాటుతున్నాయి.  
► చింగారి, ట్రెల్, మోజ్‌ వంటి స్వదేశీ యాప్‌లు కోటికి పైగా డౌన్‌ లోడ్స్‌ మైలు రాయిని దాటి రికార్డు సృష్టిస్తున్నాయి.  
► ఇదే తరహాలో ‘జోష్‌’ యాప్‌ 50 లక్షల మందికి పైగా యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగిస్తుండటం విశేషం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top