భయం గుప్పెట్లో.. | in the fists of fear | Sakshi
Sakshi News home page

భయం గుప్పెట్లో..

Sep 17 2014 12:03 AM | Updated on Aug 1 2018 3:59 PM

భయం గుప్పెట్లో.. - Sakshi

భయం గుప్పెట్లో..

అచ్చంపేట/ బెల్లంకొండ : పులిచింతల ప్రాజెక్టుకు సాగర్ జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ముంపు గ్రామాలు ప్రమాదం అంచుకు చేరుకున్నాయి.

అచ్చంపేట/ బెల్లంకొండ :
 పులిచింతల ప్రాజెక్టుకు సాగర్ జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ముంపు గ్రామాలు ప్రమాదం అంచుకు చేరుకున్నాయి. బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాలైన  గొల్లపేట, కోళ్లూరు, పులిచింతలను సోమవారం నుంచి వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు భయం గుప్పెట్లో బిక్కు బిక్కుమంటున్నారు.
  ఈ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లపేట నుంచి పులిచింతల, బోదనం రహదారులు నీట మునిగాయి. దీంతో అధికారులు గొల్లపేట గ్రామంలోని నిర్వాసితులను పడవల ద్వారా సమీపం లోని కొండ పైకి చేర్చారు. సామగ్రి అంతా గ్రామాలలోనే ఉండడంతో కొండలపై పిల్లలతో డేరాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు.
  ఈ మూడు గ్రామాల్లో ఆరు వందల ఎకరాల్లో వేసిన పత్తి తదితర పంటలు నీట మునిగాయి. సోమవారం రాత్రికి ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో కొంత మేర వరద ప్రవాహం తగ్గింది.
 = పులిచింతల ప్రాజెక్టుకు మంగళవారం నాటికి 9.2 టీఎంసీల నీరు చేరింది. 11 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నా నాగార్జున సాగర్ నుంచి వచ్చిన నీటిని వచ్చిన ట్లు బయటకు వదులు తున్నారు. సోమవారం సాగర్ నుం చి లక్ష క్యూసెక్కుల నీటిని వదలడంతో ఆ నీరు రాత్రి 10 గంటల సమయానికి పులిచింతల ప్రాజెక్టుకు చేరుకుంది. 
 = అప్పటికే వరద నీరు బెల్లంకొండ మండలం గొల్లపేట, కోళ్లూరు గ్రామాలను తాకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ రమేష్‌బాబు, సూపరింటెం డెంట్ ఇంజినీరు చంద్రశేఖర్‌లు హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లుగా బయటకు పంపే ఏర్పాట్లు చేశారు. అయితే తెరచి ఉంచిన ఆరు గేట్ల నుంచి సక్రమంగా నీళ్లు బయటకు పోకపోవడం, మిగిలిన గేట్లు పైకిలేచేందుకు మొరాయించడంతో అధికారులు ఆందోళన చెందారు. 
 = అతికష్టం మీద అర్ధరాత్రి సమయానికి 10  క్రష్ట్ గేట్లు పైకి లేపడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లేకుంటే బెల్లంకొండ మండలంలో మరి కొన్ని గ్రామాలు నీట మునిగి ఉండేవి.
 నిల్వ ఉంచలేకనే బయటకు.... 
 = ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 9.2 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. మొ త్తం సామర్థ్యం 46.5 టీఎంసీలు  కాగా ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి అయిన దానిని బట్టి 11 టీఎంసీల వరకు మాత్రమే నీటిని నిల్వ చేసే అవకశాలు ఉన్నాయి.
 = ప్రాజెక్టులో 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచినట్లయితే బెల్లంకొండ మండలం గొల్లపేట, కోళ్లూరు, చిట్యాల, కేతవరం గ్రామాలు ముంపునకు గురవతాయి. అందువల్ల ప్రాజెక్టులో సామర్థ్యం ఉన్నా వచ్చిన నీటిని నిల్వ ఉంచలేక అధికారులు బయటకు వదులుతున్నారు. 
 గ్రామాల నుంచి కదలబోమంటున్న నిర్వాసితులు
 గ్రామాలలోకి వరద నీరు వచ్చి చేరుతున్నప్పటికీ తాము ఇల్లు ఖాళీ చేసి వెళ్లబోమని నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు.
 = రెండు రోజులుగా వరద నీరు ముంపు గ్రామాలకు చేరుతున్న నేపథ్యంలో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాల్సిందిగా రెవెన్యూ అధికారి కె.లక్ష్మీ ప్రసాద్ ప్రకటించారు.
 = వరద నీరు రావడం ప్రారంభమైన మొదటి రోజు నుంచే అధికారులు గ్రామాలకు వెళ్లి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ నిర్వాసితులు కదలడం లేదు.
 = తమకు రావలసిన నష్టపరిహారం ఇంత వరకు అందలేదని కోళ్లూరు గ్రామస్తులు అధికారులకు చెబుతున్నారు. ప్యాకేజీ ఇవ్వకపోవడంతో పునరావాస కేంద్రాల్లో ఇళ్లు కూడా నిర్మించుకోలేదని తెలిపారు. 
 = కొంత మంది సొంత డబ్బులతో నిర్మాణాలు చేపట్టినా బిల్లులు మంజూరు కాక అవి పూర్తి కాలేదని తెలిపారు.
 = ఇప్పుడు తాము పునరావాస కేంద్రాలకు వెళితే ఇకపై అధికారులు తమ గురించి పట్టించుకోరని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నిర్వాసితులు మాత్రం తమకు అందవలసిన ప్యాకేజీ,వసతుల కల్పనపై ఉన్నతాధికారులు, మంత్రుల నుంచి స్పష్టమైన హామీ లభిస్తే ఇక్కడి నుంచి తరలివెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.  
 ముంపు గ్రామాలను 
 పరిశీలించిన డిఎస్పీ,సీఐ...
 మండలంలోని ముంపు గ్రామాలైన బోదనం, గొల్లపేట,కోళ్లూరును వరద నీరు చుట్టుముట్టడంతో మంగళవారం సత్తెనపల్లి డిఎస్పీ వెంకటేశ్వర్లు నాయక్, పిడుగురాళ్ల అర్బన్ సిఐ శ్రీధర్‌రెడ్డిలు సందర్శించారు. రహదారులు నీట మునగటంతో పడవల ద్వారా గ్రామాలకు వెళ్లి గ్రామాలను ఖాళీ చేయాలని నిర్వాసితులకు సూచించారు. 
 11 టీఎంసీలునిల్వ ఉంచాలంటే..
 = పులిచింతల ప్రాజెక్టులో 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలంటే ముందుగా పునరావాస కేంద్రాలను పూర్తి చేయాలి. ముంపు గ్రామస్తులకు పరిహారం ఇచ్చి పునరావాస కేంద్రాలకు పంపాలి.  నూతన ప్రభుత్వం ఆ దిశగా పనులు చేపట్టకుండా ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచి తీరుతామని కేవలం హామీలకే పరిమితమవుతోంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement