plain villages
-
ఇంకెన్నాళ్లు...ఎదురుచూపులు!
సాక్షి, పెంట్లవెల్లి(నాగర్‌కర్నూలు) : శ్రీశైలం ప్రాజెక్టు కట్టడంతో ఏటి ఒడ్డున ఉన్న ఎన్నో గ్రామాలు 38ఏళ్ల క్రితం ముంపునకు గురయ్యాయి. అందులో ఎన్నో గ్రామాల్లో ఇళ్లు, పొలాలు, కల్లందొడ్లు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నష్టపోయిన వారికి ప్రత్యేక జీఓ ఏర్పాటు చేస్తున్నామని 98 జీఓను గతంలో ఏర్పాటు చేశారు. కానీ అప్పటి నుంచి సవరించిన జీఓను అమలు పర్చలేకపోయారు. కొంతమందికి మాత్రమే అందులో ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన ఎంతోమందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు. ఇటు ఉద్యోగాలు రాక.. సరైన నష్టపరిహారం రాక ముంపు బాధితులు జీవనోపాధి కోసం గోడు వెల్లబోసుకుంటున్నారు. మంత్రి, కలెక్టర్ల చర్యలు నిష్ఫలం వనపర్తి, కొల్లాపూర్, చిన్నంబావి ఏరియాల్లో 2500 వరకు ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఏటా ఎన్నికల ముందు వారికి ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ హామీలిస్తున్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో ఉద్యోగాలిస్తామని మాటలు చెప్పారు.. కానీ ఇంతవరకు శ్రద్ధ చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత లేని వారికి రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశామని, ఏ ఒక్కరూ దీనిపై చర్చలు జరపలేదని వాపోతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, గత కలెక్టర్లు చర్చలు చేసినా.. ఏమీ తేల్చలేకపోయారు. పాదయాత్ర చేపట్టినా ఫలితం శూన్యం జటప్రోల్, మాధవస్వామినగర్, మంచాలకట్ట, మల్లేశ్వరం, ఎంగంపల్లిలో దాదాపుగా 250 మంది 98 జీఓ నిర్వాసితులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు లేక, అటు నష్టపరిహారం లేక భూములు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు, లేనివారికి రూ.10లక్షలు ఇవ్వాలని గతంలో అలంపూర్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టినా.. ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే హామీ ఫలించేనా? ఈసారి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్నికల ముందు ఖచ్చితంగా 98 జీఓ నిర్వాసితులకు ఉద్యోగాలిప్పిస్తానని హామీ ఇచ్చారని, ఈసారైనా తమ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నామని పేర్కొంటున్నారు. భూములు నష్టపోయిన వారికి పరిహారం అందించాలని కోరుతున్నారు. లేదంటే ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయా గ్రామాల 98 జీఓ నిర్వాసితులు పేర్కొంటున్నారు. ఏటి ఒడ్డున ఉన్న ప్రాంతాల వారందరూ జీవనోపాధి కోసం ఎదురుచూస్తున్నారని.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారైనా ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. ఈసారైనా ఉద్యోగాలివ్వండి 38ఏళ్ల నుంచి ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నా ఇంతవరకు మా కల నెరవేరడంలేదు. సర్వం కోల్పోయిన మాకు ఉద్యోగాలే దిక్కని అనుకున్నాం. ఇప్పటికైనా అవకాశం కల్పించాలి. – ఖాజామైనోద్దీన్, 98 జీఓ జిల్లా అధ్యక్షుడు -
గృహ నిర్బంధంలో జయశ్రీ
ప్రొద్దుటూరు క్రైం: ఏ సంఘటన జరిగినా ఆమెను గృహ నిర్బంధం చేయండం పోలీసులకు పరిపాటిగా మారింది. మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీని గండికోట ముంపు గ్రామాల విషయమై పలు మార్లు గృహ నిర్బంధం చేశారు. ఆమె ముంపు వాసుల తరపున జలదీక్షతోపాటు అనేక పోరాటాలు చేశారు. పోలీసులు గృహ నిర్బంధం చేసినా వారి కళ్లు కప్పి అర్ధరాత్రి సమయంలో చౌటపల్లెకు వెళ్లారు. ఆయా గ్రామ ప్రజల ఆందోళనలతోపాటు జయశ్రీలాంటి ఉద్యమ నాయకుల ఫలితంగా ముంపు గ్రామాలకు న్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఈక్రమంలోనే బుధవారం ముగ్గురు పోలీసులు జయశ్రీ ఇంటి వద్దకు వచ్చి గృహ నిర్బంధం చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకు చేస్తారని ఆమె ప్రశ్నించగా పోలీసులు సమాధానం చెప్పలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని వారు చెప్పారు. రెండు రోజుల క్రితం ఆమె చౌటపల్లెతోపాటు పలు ముంపు గ్రామాలకు వెళ్లి పరిహారం అందని వారితో మాట్లాడారు. వారికి ఎందుకు చెక్కులు ఇవ్వలేదన్న విషయంపై అధికారులతో చర్చించారు. చౌటపల్లె గ్రామంలో ఎంతో పవిత్రంగా, వైభవంగా లింగమయ్య తిరుణాలను జరుపుకొంటారు. ముంపు నీరు రావడంతో ఇప్పటికే గ్రామస్తులు ఇళ్లు వదలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బుధ, గురువారాల్లో పండుగను వైభవంగా నిర్వహించడానికి గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసు అధికారులు పండుగ నిర్వహించకుండా ఆటంకం కలిగించేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గ్రామస్తులతో సమాచారం మేరకు జయశ్రీ విద్యుత్ అధికారులతో మాట్లాడి తిరిగి గ్రామానికి విద్యుత్ సరఫరా చేయించారు. ముంపు గ్రామాల్లో ఎలాంటి సమస్య లేదని అయినప్పటికీ తనను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని జయశ్రీ తెలిపారు. అసలు కారణం ఇదే... జయశ్రీని పోలీసులు గృహ నిర్బంధం ఎందుకు చేశారో బుధవారం సాయంత్రానికి తెలిసింది. పైడిపాలెం ప్రాజెక్టు కింద ఉన్న తొండూరు రైతులు ఆమెకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు పైడిపాలెం ప్రాజెక్టు కింద మొదటగా వచ్చే ఊరు తొండూరు. అయితే ఆ గ్రామానికి నీరు ఇవ్వకుండా దిగువ ప్రాంతంలో ఉన్న ఇతర గ్రామాలకు అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు జిల్లా అధికారులతో మాట్లాడినప్పటికీ ఫలితం లేదు. ఈ క్రమంలోనే పైడిపాలెం ప్రాజెక్టు వద్ద తొండూరు, దిగువ ప్రాంత రైతులు ఘర్షణ పడ్డారు. బుధవారం ప్రాజెక్టు వద్ద రైతులు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి జయశ్రీ వెళతారేమోనని భావించిన పోలీసులు ముందస్తుగా ఆమెను గృహ నిర్బంధం చేశారు. -
భయం గుప్పెట్లో..
అచ్చంపేట/ బెల్లంకొండ : పులిచింతల ప్రాజెక్టుకు సాగర్ జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ముంపు గ్రామాలు ప్రమాదం అంచుకు చేరుకున్నాయి. బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాలైన గొల్లపేట, కోళ్లూరు, పులిచింతలను సోమవారం నుంచి వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు భయం గుప్పెట్లో బిక్కు బిక్కుమంటున్నారు. ఈ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లపేట నుంచి పులిచింతల, బోదనం రహదారులు నీట మునిగాయి. దీంతో అధికారులు గొల్లపేట గ్రామంలోని నిర్వాసితులను పడవల ద్వారా సమీపం లోని కొండ పైకి చేర్చారు. సామగ్రి అంతా గ్రామాలలోనే ఉండడంతో కొండలపై పిల్లలతో డేరాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ మూడు గ్రామాల్లో ఆరు వందల ఎకరాల్లో వేసిన పత్తి తదితర పంటలు నీట మునిగాయి. సోమవారం రాత్రికి ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో కొంత మేర వరద ప్రవాహం తగ్గింది. = పులిచింతల ప్రాజెక్టుకు మంగళవారం నాటికి 9.2 టీఎంసీల నీరు చేరింది. 11 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నా నాగార్జున సాగర్ నుంచి వచ్చిన నీటిని వచ్చిన ట్లు బయటకు వదులు తున్నారు. సోమవారం సాగర్ నుం చి లక్ష క్యూసెక్కుల నీటిని వదలడంతో ఆ నీరు రాత్రి 10 గంటల సమయానికి పులిచింతల ప్రాజెక్టుకు చేరుకుంది. = అప్పటికే వరద నీరు బెల్లంకొండ మండలం గొల్లపేట, కోళ్లూరు గ్రామాలను తాకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ రమేష్‌బాబు, సూపరింటెం డెంట్ ఇంజినీరు చంద్రశేఖర్‌లు హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లుగా బయటకు పంపే ఏర్పాట్లు చేశారు. అయితే తెరచి ఉంచిన ఆరు గేట్ల నుంచి సక్రమంగా నీళ్లు బయటకు పోకపోవడం, మిగిలిన గేట్లు పైకిలేచేందుకు మొరాయించడంతో అధికారులు ఆందోళన చెందారు. = అతికష్టం మీద అర్ధరాత్రి సమయానికి 10 క్రష్ట్ గేట్లు పైకి లేపడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లేకుంటే బెల్లంకొండ మండలంలో మరి కొన్ని గ్రామాలు నీట మునిగి ఉండేవి. నిల్వ ఉంచలేకనే బయటకు.... = ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 9.2 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. మొ త్తం సామర్థ్యం 46.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి అయిన దానిని బట్టి 11 టీఎంసీల వరకు మాత్రమే నీటిని నిల్వ చేసే అవకశాలు ఉన్నాయి. = ప్రాజెక్టులో 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచినట్లయితే బెల్లంకొండ మండలం గొల్లపేట, కోళ్లూరు, చిట్యాల, కేతవరం గ్రామాలు ముంపునకు గురవతాయి. అందువల్ల ప్రాజెక్టులో సామర్థ్యం ఉన్నా వచ్చిన నీటిని నిల్వ ఉంచలేక అధికారులు బయటకు వదులుతున్నారు. గ్రామాల నుంచి కదలబోమంటున్న నిర్వాసితులు గ్రామాలలోకి వరద నీరు వచ్చి చేరుతున్నప్పటికీ తాము ఇల్లు ఖాళీ చేసి వెళ్లబోమని నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు. = రెండు రోజులుగా వరద నీరు ముంపు గ్రామాలకు చేరుతున్న నేపథ్యంలో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాల్సిందిగా రెవెన్యూ అధికారి కె.లక్ష్మీ ప్రసాద్ ప్రకటించారు. = వరద నీరు రావడం ప్రారంభమైన మొదటి రోజు నుంచే అధికారులు గ్రామాలకు వెళ్లి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ నిర్వాసితులు కదలడం లేదు. = తమకు రావలసిన నష్టపరిహారం ఇంత వరకు అందలేదని కోళ్లూరు గ్రామస్తులు అధికారులకు చెబుతున్నారు. ప్యాకేజీ ఇవ్వకపోవడంతో పునరావాస కేంద్రాల్లో ఇళ్లు కూడా నిర్మించుకోలేదని తెలిపారు. = కొంత మంది సొంత డబ్బులతో నిర్మాణాలు చేపట్టినా బిల్లులు మంజూరు కాక అవి పూర్తి కాలేదని తెలిపారు. = ఇప్పుడు తాము పునరావాస కేంద్రాలకు వెళితే ఇకపై అధికారులు తమ గురించి పట్టించుకోరని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నిర్వాసితులు మాత్రం తమకు అందవలసిన ప్యాకేజీ,వసతుల కల్పనపై ఉన్నతాధికారులు, మంత్రుల నుంచి స్పష్టమైన హామీ లభిస్తే ఇక్కడి నుంచి తరలివెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ముంపు గ్రామాలను పరిశీలించిన డిఎస్పీ,సీఐ... మండలంలోని ముంపు గ్రామాలైన బోదనం, గొల్లపేట,కోళ్లూరును వరద నీరు చుట్టుముట్టడంతో మంగళవారం సత్తెనపల్లి డిఎస్పీ వెంకటేశ్వర్లు నాయక్, పిడుగురాళ్ల అర్బన్ సిఐ శ్రీధర్‌రెడ్డిలు సందర్శించారు. రహదారులు నీట మునగటంతో పడవల ద్వారా గ్రామాలకు వెళ్లి గ్రామాలను ఖాళీ చేయాలని నిర్వాసితులకు సూచించారు. 11 టీఎంసీలునిల్వ ఉంచాలంటే.. = పులిచింతల ప్రాజెక్టులో 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలంటే ముందుగా పునరావాస కేంద్రాలను పూర్తి చేయాలి. ముంపు గ్రామస్తులకు పరిహారం ఇచ్చి పునరావాస కేంద్రాలకు పంపాలి. నూతన ప్రభుత్వం ఆ దిశగా పనులు చేపట్టకుండా ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచి తీరుతామని కేవలం హామీలకే పరిమితమవుతోంది. -
ముంపు గ్రామాల విలీనంపై 15న గెజిట్
-
ముంపు గ్రామాల విలీనంపై 15న గెజిట్
ఏపీ సర్కారు ఉత్తర్వులు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15న గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈమేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ జిల్లా ఫార్మేషన్ యాక్ట్ 1974 ప్రకారం కుకునూరు, వేలేరుపాడు రెవెన్యూ మండలాలతో పాటు బూర్గంపాడు మండలం పరిధిలోని సీతారామనగరం, శ్రీధర వేలేరు, గుంపనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట్, రవిగూడెం గ్రామాలను పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తున్న ట్టు పేర్కొన్నారు. భద్రాచలం (భద్రాచలం రెవె న్యూ గ్రామం మినహాయింపు), కూనవరం, చిం తూరు, వర రామచంద్రాపురం రెవెన్యూ మండలాలను తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెవెన్యూ మండలాలు, గ్రామాల విలీనం, దీనివలన నష్టపోతున్న ప్రజలపై తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు నివేదికలు ఇచ్చారని, వాటిని భూపరిపాలన శాఖ (సీసీఎల్ఏ) క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా పరిపాలన సౌలభ్యం కోసం ఈ మండలాలు, గ్రామాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేస్తూ 15న అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ఇస్తున్నట్టు చెప్పారు.