పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ ఆ
ఏపీ సర్కారు ఉత్తర్వులు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15న గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈమేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ జిల్లా ఫార్మేషన్ యాక్ట్ 1974 ప్రకారం కుకునూరు, వేలేరుపాడు రెవెన్యూ మండలాలతో పాటు బూర్గంపాడు మండలం పరిధిలోని సీతారామనగరం, శ్రీధర వేలేరు, గుంపనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట్, రవిగూడెం గ్రామాలను పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేస్తున్న ట్టు పేర్కొన్నారు.
భద్రాచలం (భద్రాచలం రెవె న్యూ గ్రామం మినహాయింపు), కూనవరం, చిం తూరు, వర రామచంద్రాపురం రెవెన్యూ మండలాలను తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెవెన్యూ మండలాలు, గ్రామాల విలీనం, దీనివలన నష్టపోతున్న ప్రజలపై తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు నివేదికలు ఇచ్చారని, వాటిని భూపరిపాలన శాఖ (సీసీఎల్‌ఏ) క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా పరిపాలన సౌలభ్యం కోసం ఈ మండలాలు, గ్రామాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేస్తూ 15న అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ఇస్తున్నట్టు చెప్పారు.