తమ్ముళ్ల పంథా...రియల్‌ దందా 

Improper Layouts Found In Madakasira - Sakshi

మడకశిరలో వెలసిన అక్రమ లేఅవుట్లు 

ఓ టీడీపీ నేత కనుసన్నల్లోనే రియల్‌ వ్యాపారం 

ఇన్నాళ్లూ కన్నెత్తి చూడని మున్సిపల్‌ అధికారులు 

ఎమ్మెల్యే సమీక్షలో వెలుగుచూసిన అక్రమాలు 

తాజాగా నోటీసులు జారీ చేసిన అధికారులు 

మడకశిరలో టీడీపీ నేతలు ఐదేళ్లూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారం అండతో అక్రమాలకు తెరతీశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు వేసేశారు. అమాయకులకు వాటిని అంటగట్టి రూ.కోట్లు కొళ్లగొట్టారు. టీడీపీలోని  ఓ కీలక నేత కనుసన్నల్లో జరిగిన ఈ రియల్‌ దందాకు అధికారులూ సహకరించినట్లు తెలుస్తోంది. 

సాక్షి, మడకశిర: మడకశిర 2012లో ఆగస్టులో నగర పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభమైంది. పైగా నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన అధికారులు, ప్రైవేటు ఉద్యోగులంతా మడకశిరలోనే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గుచూపుతుండడంతో ఇళ్ల స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ నేతలు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. పలువురు మున్సిపల్‌ అధికారులు సహకారంతో లేఅవుట్లు వేసి రూ.కోట్లు సంపాదించారు. ఈ రియల్‌ దందాకు గతంలో ఇక్కడ పని చేసిన ఓ ప్రముఖ అధికారి, మున్సిపల్‌ కార్యాలయంలో పని చేసే మరో అధికారి సహకరించినట్లు తెలిసింది.
  
ప్రధాన రోడ్ల పక్కనే.. 
టీడీపీ నాయకులు పట్టణంలోని ప్రధాన రోడ్లకిరువైపులా ఉన్న భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి లేఅవుట్లు వేస్తున్నారు. పట్టణంలో ప్రస్తుతం 20పైగా లేఅవుట్లు ఉండగా, ఇందులో 10 అక్రమంగా వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరాపురం, మధుగిరి, పెనుకొండ, పావగడ రోడ్లలో ఈ అక్రమ లేఅవుట్లు వెలిశాయి. టీడీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ ప్రముఖుల అండదండలతోనే ఈ బిజినెస్‌కు బీజం పడినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతి ఫలంగా వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా ప్లాట్లను కేటాయించినట్లు సమాచారం.
 
ఎమ్మెల్యే ఆగ్రహం 
పట్టణంలో అక్రమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకోవడం...అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులంతా అవి నిబంధనలకు విరుద్ధంగా వేసినట్లు తెలుసుకుని గగ్గోలు పెట్టారు. న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి వద్ద మొరపెట్టుకున్నారు. పైగా అక్రమ లేఅవుట్లతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి ఇటీవల మున్సిపల్‌ శాఖపై సమీక్ష  చేశారు. అక్రమ లేఅవుట్ల గురించి చర్చించారు. అక్రమ లేఅవుట్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

 
మడకశిరలో వెలసిన అక్రమ లేఅవుట్లు

పలువురికి నోటీసుల జారీ 
ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపల్‌ అధికారులు రంగ ప్రవేశం చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ షేక్‌మాలిక్‌ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. 7 లేవుట్లు అక్రమంగా వేసినట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు నోటీసు లు జారీ చేశారు. మొత్తం మీద టీడీపీ హయాంలో ఈ వ్యాపారం రూ.కోట్లల్లో జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.  

కఠినంగా వ్యవహరిస్తాం  
మడకశిరలో అక్రమంగా వేసిన లేఅవుట్లపై కఠినంగా వ్యవహరిస్తాం. ఎంతటి వారైనా వదిలేదిలేదు. 7 లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించాం. వారికి నోటీసులు కూడా జారీ చేశాం. వెంటనే లేఅవుట్లను సక్రమం చేసుకోవాలి. లేక పోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ లేఅవుట్లలో ఎవరూ స్థలాలను కొనుగోలు చేయవద్దు. ఇలాంటి లేఅవుట్లలోని ఇళ్లకు కరెంట్‌ సరఫరా, డ్రైనేజీ సౌకర్యం ఉండవు.                
– షేక్‌మాలిక్, మున్సిపల్‌ కమిషనర్, మడకశిర    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top