నిద్రపోతున్న నిఘా నేత్రాలు..!

Illegal Sand Mining Rampant In Lakkavarapukota Srikakulam - Sakshi

విచ్చలవిడిగా ఇసుక రవాణా

అక్రమంగా కోతకు గురవుతున్న వృక్షాలు

వాల్టా చట్టానికి తూట్లు

సాక్షి, లక్కవరపుకోట (విజయనగరం): అధికారుల నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. ఇసుక, కలప అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ప్రభుత్వ పాలనలో ప్రక్షాలన తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కృషిచేస్తోంది. అయితే, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో ఇష్టారాజ్యంగా వృక్షాలను నరికివేసి తరలించుకుపోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. పగలు, రాత్రీ తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడాన్ని జనం తప్పుబడుతున్నారు. ఇటీవల కాలంలో మండలంలోని పలు గెడ్డలు, వాగుల్లోని ఇసుకను తవ్వి ట్రాక్టర్లు, లారీల సాయంతో తరలించుకుపోతున్నారు. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా ఒకటి రెండు వాహనాలపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

పెద్దపెద్ద వృక్షాలను అడ్డంగా నరికేస్తున్నారు. మండలంలోని ఐదు కర్రల మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల వద్ద వివిధ  రకాలకు చెందిన వందలాది మానులు నెట్టువేసి ఉన్నాయి. అటవీశాఖ వారు ఈ అక్రమ కలప దందాపై కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. చెట్ల నరికివేతకు ఇటీవల కాలంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇంత కలప ఎలా రవాణా అవుతుందో ఆర్ధం కావడం లేదని పలువురు బహిరంగానే చెబుతున్నారు. నిఘా నేత్రాలు నొట్టబోయే సరికి అక్రమ రవాణా దారులు దందాలకు తెగబడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని అక్రమ రవాణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top