దొరికినంత దోచెయ్ | Illegal Move the sand | Sakshi
Sakshi News home page

దొరికినంత దోచెయ్

Apr 18 2015 2:42 AM | Updated on Aug 28 2018 8:41 PM

గోదావరిలో పడవలు పెట్టుకుని అవసరమైనంత ఇసుక తవ్వుకోవచ్చు...

- స్నానఘట్టాల నిర్మాణానికి అక్రమంగా ఇసుక తరలింపు
- ప్రభుత్వ ఆదాయానికి గండి.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

కొవ్వూరు : గోదావరిలో పడవలు పెట్టుకుని అవసరమైనంత ఇసుక తవ్వుకోవచ్చు. పట్టపగలైనా భయం లేదు. వే బిల్లులు తీసుకోనక్కర్లేదు. సీనరేజి చెల్లించాల్సిన పనిలేదు. డీడీలు తీసి మీ-సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. లారీలకు వేలకు వేలు  కిరాయిలు చెల్లించక్కర్లేదు. నేరుగా ఇసుక తవ్వుకుని చకచకా పనులు చేసేసుకోవచ్చు. గోదావరి పుష్కరాల

సందర్భంగా జిల్లాలో స్నానఘట్టాల నిర్మాణ పనులు చేస్తున్న కొందరు కాంట్రాక్టర్లు నదిలోని ఇసుకను దర్జాగా దోపిడీ చేస్తున్న వైనమిది. ఈ అక్రమ నిర్వాకం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అయినా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. కొందరు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో కాంట్రాక్టర్లు ఈ అక్రమ తంతు నడిపిస్తున్నారు. కొవ్వూరులో పుష్కర పనులు చేస్తున్న కొందరు కాంట్రాక్టర్లు కొన్నిరోజులుగా గోదావరిలోని ఇసుకను పడవల ద్వారా సేకరించి వినియోగిస్తున్నారు. స్నానఘట్టాల నిర్మాణానికి 36వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అంచనా.

ఇప్పటివరకు సుమారు 30 శాతం పనులు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. అంటే సుమారు 10 క్యూబిక్ మీటర్ల (విలువ రూ.65 లక్షలు) ఇసుకను వినియోగించినట్టు అంచనా. ఇటీవల స్నానఘట్టాల పరిశీ లనకు ఆర్డీవో బి.శ్రీనివాసరావు రాగా, పడవల ద్వారా ఇసుక సేకరణ విషయం ఆయన దృష్టికి వెళ్లింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులను హెచ్చరించారు. అయినప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్ల వైఖరిలో మార్పు కనిపించలేదు. యథేచ్ఛగా ఇసుకను దొంగిలిస్తూనే ఉన్నారు.

మంత్రి వచ్చినా..
కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో నిర్మిస్తున్న స్నానఘట్టాలను పరిశీలించేందుకు స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత శుక్రవారం వచ్చారు. ఆమె కళ్లెదుటే ఈ అక్రమ భాగోతం కొనసాగింది. ఇసుక అక్రమ రవాణా విషయాన్ని విలేకరులు మం త్రి దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు హడావుడిగా రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు.

కాంట్రాక్టర్లపై చర్యలు : కలెక్టర్
ఈ విషయమై కలెక్టర్ కె.భాస్కర్ స్పం దిస్తూ ఇసుక అక్రమంగా సేకరించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా చేస్తూ తొలిసారి పట్టుబడితే రూ.40 వేల జరిమానా విధిస్తామని, రెండోసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేస్తామని చెప్పారు. మూడో సారి పట్టుబడిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. పనులకు వినియోగించిన ఇసుకకు సంబంధించి కాంట్రాక్టర్ బిల్లులు చూపించకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించారు.

నలుగురిపై కేసు నమోదు
ఇసుక అక్రమ తరలింపునకు పాల్పడినట్టు తహసిల్దార్ ఎం.గంగరాజు ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. పడవల నిర్వహకులు చింతపల్లి రాంబాబు, రంకిరెడ్డి సుబ్బారావు, వరికూటి దుర్గారావుతో పాటు కాంట్రాక్టర్ గాలి సుబ్బరాజుపై కేసు నమోదు చేసి, రెండు పడవల్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement