వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్లపై అక్రమ కేసులు | Illegal cases Files on YSRCP Leaders in YSR Kadapa | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్లపై అక్రమ కేసులు

Mar 8 2019 1:04 PM | Updated on Mar 8 2019 1:04 PM

Illegal cases Files on YSRCP Leaders in YSR Kadapa - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న కడప మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, ఎస్‌. రఘురామిరెడ్డి

కడప అర్బన్‌: జిల్లాలో ఫారం–7 పేరుతో తమ పార్టీకి చెందిన బూత్‌ కమిటీ కన్వీనర్లను పోలీస్‌ స్టేషన్‌లకు పిలిపించి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, ఎస్‌. రఘురామిరెడి, పార్టీ నాయకులు గురువారం ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మను కలిశారు. తమ బూత్‌ కన్వీనర్లను వేధింపులకు గురిచేస్తున్న వైనాలను వారు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఎస్పీ సానుకూలంగా స్పందించారు.  ఈసందర్భంగా కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, కడప నగర మేయర్‌ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ కడప పరిధిలో లక్షా 28వేల ఓట్లు అక్రమంగా తొలగించారన్నారు. వాటిలో దాదాపు 77వేల ఓట్లు రెన్యూవల్‌చేయడంలో వైఎస్‌ఆర్‌సిపి బూత్‌ కమిటీ కన్వీనర్‌లే కీలకపాత్ర పోషించారన్నారు. కానీ ఇందుకు భిన్నంగా పార్టీ బూత్‌ కమిటీ కన్వీనర్‌లను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

ఎలాంటి భయాలకు లోనుకావాల్సిన అవసరంలేదని బూత్‌ కన్వీనర్లకు ఆయన భరోసా ఇచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో కేసుల్లో వున్న వారిని మాత్రమే బైండోవర్‌ చేయాలని.. అనవసరంగా ఎవరిపైనా బైండోవర్‌లు చేసి, ఇబ్బందులకు గురి చేయవద్దనీ ఎస్పీని కోరామన్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ కేసుల విషయంలో ఎన్నికల కమిషన్‌ సిఫారసులను అనుసరిస్తామని ఎస్పీహామీ ఇచ్చారన్నారు, క్షణ్ణంగా విచారించి చర్యలు చేపడతామన్నారన్నారు. ఓట్ల తొలగింపు పేరుతో బూత్‌ కమిటీ కన్వీనర్లపై కేసులు బనాయించడం సరికాదనీ కడప ఎమ్మెల్యే అంజద్‌బాష ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో 2లక్షల 56వేల ఓట్లు వుండగా, లక్షా 64 వేల ఓట్లను అక్రమంగా తొలగించారన్నారు. వైఎస్‌ఆర్‌సిపి బూత్‌ కమిటీ కన్వీనర్‌లు చొరవ తీసుకుని,  ఓట్ల సంఖ్యను పెంచేలా ప్రజలను చైతన్య పరిచారని గుర్తు చేశారు.  అధికార పార్టీ వారు చేయలేని పనిని తమ పార్టీ స్వచ్చందంగా నిర్వహించిదన్నారు. తమకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కొందరు అధికార పార్టీ అండదండలతో  ఫారం–7 పేరిట దొంగ దరఖాస్తులు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకుని వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు భరత్‌రెడ్డి, షఫీవుల్లా, యానాదయ్యలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement