‘నేనూ హీరోగా నటించా’

‘నేనూ హీరోగా నటించా’


అమలాపురం : ఆధునిక కాలంలో కూడా జానపదానికి ప్రాణం పోస్తున్నారు జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్. ‘ఏం పిల్లో, ఎల్దామొస్తవా..’ అంటూ తన పాటతో తెలుగు వారిని ఉర్రూతలూగించారు. కోనసీమలో షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన  అమలాపురంలో మాట్లాడారు.



 ప్రశ్న : ఉద్యమకారునిగా మీరు?

 జవాబు :  47 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాల్లో పాలుపంచుకున్నాను. సమైక్యాంధ్ర ఉద్యమం, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపైన ప్రజలతో కలిసి పదం కలిపి ఉద్యమించాను. ప్రజాఉద్యమాల్లో పాటలు పాడాను. ఇలాంటి పాటలు సుమారు 300 రచించాను. రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను.



 ప్ర: మీ పాట గురించి..!

 జ : ముఖ్యంగా ‘ఏం పిల్లో, ఎల్దామొస్తవా..’ అనే పాట 50 భాషల్లో అనువాదమైంది. అలాగే ‘యంత్రమెట్ట నడుస్తున్నదంటే..’ పాట లండన్, అమెరికాలో ఇంగ్లిష్‌లో అనువాదం చేసుకుని పాడారు.



 ప్ర : సినీ రంగానికి రావడం?

 జ : ఇప్పుడు కాదు, 80వ దశకంలోనే నేను హీరోగా ఓ సినిమాలో నటించాను. అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాలో నలుగురు హీరోల్లో నేను ఒకడిని. ఆ తర్వాత అంతగా నచ్చిన పాత్రలు రాకపోవడంతో నటించలేదు. ‘సూరి’ చిత్రంలో ఉద్యమకారుడి పాత్ర ఉందని డెరైక్టర్ ఈఎస్ వెంకట్ చెప్పారు. నాకు నచ్చడంతో చేస్తున్నాను.



 ప్ర : మరి పాటలు రాయడానికి విరామమిస్తారా?

 జ : లేదు. ఇక మీదట కూడా జానపదాన్ని, జానపద సంస్కృతిని బలపరిచే పాటలు రాస్తా.



 ప్ర : రాజకీయాల్లోకి?

 జ : ప్రజా రాజకీయాలు చేస్తాను. ప్రజల కష్టసుఖాల్లో ఉండడమే రాజకీయం. ప్రజా పోరాటాలు ఎవరు చేసినా బలపరుస్తాను.



 ప్ర : జానపద సంస్కృతిని కాపాడాలంటే?

 జ : జానపదాన్ని ఆధునికీకరించి, ప్రజా సమస్యలను అందులో చొప్పించి ప్రజల్లోకి తీసుకువెళ్లడమే నా ఉద్దేశం. జానపదాన్ని నవతరం అర్ధం చేసుకుని జానపదతత్వం పోకుండా యువకులు ఆధునికీకరించాలి. యువత జానపదాన్ని కాపాడితేనే విషసంస్కృతిని ఆపగలం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top