తన సుఖానికి అడ్డుగా ఉంటోందని భావించి ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను చంపేశాడు.
మర్రిపాడు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు) : తన సుఖానికి అడ్డుగా ఉంటోందని భావించి ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను చంపేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... మండలంలోని పల్లవోలు గ్రామానికి చెందిన రావూరి వెంకట సుబ్బారావు అలియాస్ జాన్సన్, రమాదేవి(32) దంపతులకు ఒక కుమారుడు(10), కుమార్తె(8) ఉన్నారు. అయితే వెంకట సుబ్బారావు గత కొన్ని రోజులుగా గ్రామానికి చెందిన మరో మహిళతో సంబంధం నెరుపుతున్నాడు.
ఈ విషయం తెలిసి రమాదేవికి, భర్తకు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో దంపతులు ఘర్షణ పడ్డారు. వెంకట సుబ్బారావు కత్తితో రమాదేవి గొంతును కోయటంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. పిల్లలు కేకలు వేయటంతో చుట్టుపక్కలవారంతా పోగై అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.