మాఫీ ఎలాగో తేల్చని బాబు | how Chandrababu Naidu make to clear on Waiver of agricultural loans | Sakshi
Sakshi News home page

మాఫీ ఎలాగో తేల్చని బాబు

Jun 18 2014 1:34 AM | Updated on Jul 28 2018 3:46 PM

మాఫీ ఎలాగో తేల్చని బాబు - Sakshi

మాఫీ ఎలాగో తేల్చని బాబు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీ ఎలా చేస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చలేదు.

* రుణాల మాఫీపై నెలాఖరు వరకు ఆగాలని బ్యాంకర్లకు సూచన
* కోటయ్య కమిటీ, బ్యాంకర్లు, అధికారులతో సమావేశం  
* ఆర్‌బీఐ లేఖపైనా చర్చ

 
సాక్షి, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీ ఎలా చేస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చలేదు. రుణాల మాఫీకి విధివిధానాలపై వారం రోజులుగా కసరత్తు చేస్తున్న  కోటయ్య కమిటీతో పాటు ముగ్గురు మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సమావేశమయ్యారు. అయినప్పటికీ రుణ మాఫీ ఎలాగో బాబు తేల్చలేదు. పైగా మాఫీపై స్పష్టత కోసం ఈ నెలాఖరు వరకు వేచి చూడాలని బ్యాంకర్లకు చెప్పారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కోటయ్య కమిటీలోని తొమ్మిది మంది సభ్యులు, ఆర్థిక, వ్యవసాయ, సహకార శాఖల మంత్రులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. రైతుల రుణాల మాఫీపై ఆర్‌బీఐ రాసిన లేఖలోని అంశాలు, బంగారం రుణాలపై వేలం పాటలకు బ్యాంకులు ఇస్తున్న నోటీసులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఏ పరిస్థితుల్లో రుణాల మాఫీకి హామీ ఇచ్చామో వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఆర్‌బీఐ గవర్నర్‌కు వేర్వేరుగా లేఖలు రాయాలని నిర్ణయించారు. రైతులను ఆదుకోవడానికే రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించినట్లు వివరించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
 
  వీటిపై ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో, ఆర్‌బీఐ గవర్నర్‌తో చర్చించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. బ్యాంకుల ప్రతినిధులు మాత్రం సమావేశంలో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నెలాఖరు వరకు రుణ మాఫీ ఎలాగో తేల్చకపోతే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనను వస్తుందని, అంతేకాకుండా రుణాలు మొత్తం నిరర్ధక ఆస్తులుగా మారతాయని వారు చెప్పారు. ఖరీఫ్‌లో రైతులకు మళ్లీ రుణాలు ఇవ్వాలంటే తొలుత రుణాలను చెల్లించాలని, ఆ తరువాత మాఫీ వర్తింపజేస్తామని ప్రభుత్వం తరఫున రైతులకు సందేశమివ్వాలని కూడా బ్యాంకుల ప్రతినిధులు సూచిం చారు. దీనిపై చూద్దాం అంటూ చంద్రబాబు సమాధానాన్ని దాటవేశారు. వీలైనంత ఎక్కువ మంది రైతులకు రుణ మాఫీ ని వర్తింపజేయాలని అనుకుంటున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, కేంద్రాన్ని, ఆర్‌బీఐని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని బాబు చెప్పినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement