డ్రైవర్‌ నిజాయితీ

Honest Bus Driver Return To Passenger Bag - Sakshi

బస్సులో వదిలేసిన బ్యాగ్‌

బాధితుడికి అందజేత

శ్రీకాకుళం అర్బన్‌: విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంనకు విశాఖలో బయలుదేరిన ఓ ప్రయాణికుడు నాన్‌స్టాప్‌ బస్సులో తన బ్యాగ్‌ను ఉంచి కిందికి దిగాడు. ఈలోగా బస్సు బయలుదేరింది. శ్రీకాకుళంలో ప్రయాణికులందరూ దిగిపోగా బస్సు సీటులో మాత్రం బ్యాగ్‌ కనిపించింది. దీంతో ఆ బస్సు డ్రైవర్‌ కృష్ణ ఆ బ్యాగ్‌ను తీసుకువచ్చి శ్రీకాకుళం ఒకటవ డిపో మేనేజర్‌కు అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే...

పాతపట్నంనకు చెందిన టి.బాలకృష్ణ అనే వ్యక్తి సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా జమ్మూ–కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చేందుకు విశాఖపట్నం బస్‌స్టేషన్‌కు ఆదివారం చేరుకుని విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరే నాన్‌స్టాప్‌ బస్సుకు ఒక టికెట్‌ తీసుకున్నాడు. ఆ టికెట్‌తో బస్‌ వద్దకు చేరుకుని తన సీటులో బ్యాగ్, లగేజీని ఉంచి కిందికి దిగిపోయాడు. అతని కోసం కొంత సమయం వేచి చూసిన తర్వాత బస్సు విశాఖపట్నంలో 3.30 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సాయంత్రం 5.30కు చేరుకుంది. ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత సీటులో బ్యాగ్, లగేజీ ఉండడాన్ని గమనించిన హైర్‌బస్‌ డ్రైవర్‌ కృష్ణ ఆ లగేజీని శ్రీకాకుళం ఒకటవ డిపో మేనేజర్‌ డి.ఢిల్లేశ్వరరావుకు అప్పగించారు.

దొరికిన ఆ బ్యాగ్‌లో క్యాష్‌ పర్సు, హేండ్‌ బ్యాగ్, లగేజీబ్యాగ్, ఏటీఎం కార్డు, సీఐఎస్‌ఎఫ్‌ ఐడెంటిటీ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌కార్డు తదితరవి ఉన్నాయి. వస్తువులను బస్సులో ఉంచిన బాలకృష్ణ అవి తనవే అని, విశాఖపట్నంలో బస్సు ఎక్కిన తర్వాత సీటులో పెట్టి అత్యవసర పనిపై కిందకి దిగానని, ఈలోగా బస్సు బయలుదేరడంతో తర్వాత బస్సుకు వచ్చి విచారించగా కాంప్లెక్స్‌లో అప్పగించినట్టు తెలుసుకుని వచ్చానని శ్రీకాకుళం ఒకటవ డిపో మేనేజర్‌ ఢిల్లేశ్వరరావుకు వివరించారు. బాలకృష్ణ చెప్పిన వివరాలు, ఐడెంటిటీ కార్డుల ఆధారంగా బస్సులో దొరికిన బ్యాగ్, వస్తువులు అతనివే అని నిర్ధారణ చేసుకుని బాలకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా డ్రైవర్‌ కృష్ణకు బాలకృష్ణ అభినందిస్తూ రూ. 300 నగదు ప్రోత్సాహకం అందజేశారు. వారితో పాటు సెక్యూరిటీ గార్డు ఎంపీ రావు తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top